విదేశాలకు వెళ్లాల్సి ఉంది టీకా ఎప్పుడు తీసుకోవాలి?

నాకు నెల క్రితం కొవిడ్‌-19 వచ్చి, తగ్గిపోయింది. పై చదువుల కోసం నేను ఆగస్టులో విదేశాలకు వెళ్లాల్సి ఉంది. నేను కొవిడ్‌ టీకా ఎప్పుడు తీసుకోవటం మంచిది? ఇప్పుడు కొవిషీల్డ్‌ టీకా తీసుకుంటే రెండో మోతాదు కోసం 12 వారాలు ఆగాల్సి ఉంటుంది. అప్పటికి నేను భారత్‌లో ఉండకపోవచ్చు.

Published : 08 Jun 2021 00:46 IST

సమస్య సలహా

సమస్య: నాకు నెల క్రితం కొవిడ్‌-19 వచ్చి, తగ్గిపోయింది. పై చదువుల కోసం నేను ఆగస్టులో విదేశాలకు వెళ్లాల్సి ఉంది. నేను కొవిడ్‌ టీకా ఎప్పుడు తీసుకోవటం మంచిది? ఇప్పుడు కొవిషీల్డ్‌ టీకా తీసుకుంటే రెండో మోతాదు కోసం 12 వారాలు ఆగాల్సి ఉంటుంది. అప్పటికి నేను భారత్‌లో ఉండకపోవచ్చు. అప్పుడేం చేయాలి? విదేశాలకు వెళ్లే ముందు ఎంఎంఆర్‌ టీకా కూడా తీసుకోవాల్సి ఉంది. ఎంఎంఆర్‌ టీకా తీసుకున్నాక ఎంత కాలానికి కొవిడ్‌ టీకా తీసుకోవచ్చు?        

  - సాయితేజ్‌ (ఈ-మెయిల్‌)

సలహా: ఒకసారి కొవిడ్‌ నుంచి కోలుకున్నాక 3 నెలల తర్వాతే టీకా వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ  మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక 3 నెలల వరకు సహజ యాంటీబాడీల రక్షణ లభిస్తుంది. పాత మార్గదర్శకాల ప్రకారమైతే 4-6 వారాలు ఆగాల్సి ఉండేది. ఇంతకుముందు ఈ వ్యవధిలో ఎంతోమంది టీకా తీసుకున్నారు కూడా. అందువల్ల విదేశాలకు వెళ్లటం వంటి ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేవారు కొవిడ్‌ తగ్గాక 4-6 వారాల తర్వాత మొదటి మోతాదు టీకా తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పుడు విదేశాలకు వెళ్లేవారికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఐపీఎంలో టీకాలు ఇవ్వటం ఆరంభించింది. కొవాగ్జిన్‌ అయినా, కొవిషీల్డ్‌ అయినా.. మొదటి మోతాదు పొందిన 4 వారాలకే రెండో మోతాదునూ ఇవ్వాలంటూ నిబంధనలు సడలించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు ఆగస్టులో విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మొదటి మోతాదు, నెల తర్వాత రెండో మోతాదు తీసుకోవచ్చు. మీరు ఎంఎంఆర్‌ టీకా కూడా తీసుకోవాల్సి ఉందంటున్నారు. సాధారణంగా ఇతర రకాల టీకాలకు మధ్య రెండు వారాల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. మీరు ముందుగా ఎంఎంఆర్‌ టీకా తీసుకోవటమే మంచిది. రెండు వారాల తర్వాత కొవిడ్‌ టీకా మొదటి మోతాదు తీసుకోవచ్చు. అప్పటికి కొంత అదనపు సమయం లభించినట్టవుతుంది. నెల తర్వాత రెండో మోతాదు తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకున్నా టీకా తీసుకునే అవకాశం లభించటానికి కనీసం 15 రోజులైనా పట్టొచ్చు. అందువల్ల ముందే ఎంఎంఆర్‌ టీకా తీసుకుంటే ఈ కాలాన్ని ఉపయోగించుకున్నట్టూ అవుతుంది.

-డా।। కె.శుభాకర్‌, సీనియర్‌ పల్మనాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని