వ్యసనాలతో ‘డీ’

వ్యసనాల బారి నుంచి బయటపడలేక పోతున్నారా? అయితే ఒకసారి విటమిన్‌ డి మోతాదులను పరీక్షించుకోండి. దీని లోపంతో మత్తుమందుల వ్యసనానికి లోనయ్యే అవకాశముంటున్నట్టు మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ అధ్యయనం పేర్కొంటోంది మరి.

Updated : 15 Jun 2021 05:58 IST

వ్యసనాల బారి నుంచి బయటపడలేక పోతున్నారా? అయితే ఒకసారి విటమిన్‌ డి మోతాదులను పరీక్షించుకోండి. దీని లోపంతో మత్తుమందుల వ్యసనానికి లోనయ్యే అవకాశముంటున్నట్టు మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ అధ్యయనం పేర్కొంటోంది మరి. విటమిన్‌ డి లోపిస్తే ఆస్థమా, ఎముకలు గుల్లబారటం, గుండెజబ్బులు, విషయగ్రహణ సామర్థ్యం క్షీణించటం వంటి సమస్యలెన్నో బయలుదేరతాయి. రోగనిరోధకశక్తి తగ్గటం.. ఎముకలు కండరాల సమస్యలు, నొప్పులు.. నిస్సత్తువ, కుంగుబాటు, జుట్టు ఊడటం వంటివన్నీ విటమిన్‌ డి లోపించాయనటానికి సంకేతాలే. విటమిన్‌ డి లోపానికి మాత్రలు వేసుకోవడం కన్నా రోజూ చర్మానికి కాసేపు ఎండ తగిలేలా చూసుకోవటం మంచిది. సముద్రపు చేపలు, పుట్ట గొడుగులు, విటమిన్‌ డి కలిపిన పాలు, నూనె వంటివి ఆహారంలో భాగం చేసుకోవటమూ మంచిదే. అవసరమైతే డాక్టర్ల సలహా మేరకు మాత్రలు వేసుకోవచ్చు.

క్యాన్సర్ల కట్టు
విటమిన్‌ డి మాత్రలతో తీవ్ర, ప్రాణాంతక క్యాన్సర్ల ముప్పు 17% తగ్గినట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. కాకపోతే ఊబకాయం, అధిక బరువు లేనివారిలోనే ఇలాంటి ప్రయోజనం కనిపించింది. తగు బరువు గలవారిలో మొత్తం క్యాన్సర్ల ముప్పు 38% తగ్గగా.. ఊబకాయులు, అధికబరువు గలవారిలో ఏమాత్రం ముప్పు తగ్గకపోవటం గమనార్హం. తగినంత బరువు ఉండి.. జీవనశైలి కారణంగానో లేదా కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్‌ బాధితులు ఉండటం మూలంగానో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉన్నవారికి విటమిన్‌ డి మాత్రలు ఉపయోగపడుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇలాంటివారు 50 ఏళ్ల వయసులో విటమిన్‌ డి మాత్రలు ఆరంభించటం మంచిదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని