ఆక్సిజన్‌ పరికరంతోనే గర్భిణి సమస్యల జాడ

గర్భధారణ ఎంత సంతోషకరమైనదైనా.. కొందరు గర్భిణులకు ఉమ్మనీరు ఎక్కువ కావటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తేలికగా గుర్తించటానికి......

Published : 22 Jun 2021 00:22 IST

ర్భధారణ ఎంత సంతోషకరమైనదైనా.. కొందరు గర్భిణులకు ఉమ్మనీరు ఎక్కువ కావటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తేలికగా గుర్తించటానికి బ్రిటన్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు ఓ వినూత్న పరికరాన్ని రూపొందించారు. దీన్ని గర్భిణి కడుపునకు అమర్చితే చాలు. దీని నుంచి వెలువడే పరారుణ (ఇన్‌ఫ్రారెడ్‌) కాంతి గర్భసంచి ముందుగోడ వద్ద అంటుకున్న మాయ భాగానికి చేరుకొని.. అక్కడి రక్తనాళాల్లో ఆక్సిజన్‌ మోతాదులను ఇట్టే గుర్తిస్తుంది. దీని ఆధారంగా ఆయా సమస్యలను గుర్తించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీన్ని 12 మంది గర్భిణులపై పరీక్షించి చూడగా.. ఐదుగురిలో అధిక రక్తపోటు, ఉమ్మనీరు పెరగటం, గర్భాశయ ముఖద్వారం చిన్నగా ఉండటం వంటి సమస్యలున్నట్టు బయటపడటం విశేషం. సగటున మాయలో ఆక్సిజన్‌ 69.6% గలవారిలో సమస్యలు తలెత్తుతుండటం గమనార్హం. ఆరోగ్యంగా ఉన్న గర్భిణుల్లో సాధారణంగా మాయలో ఆక్సిజన్‌ శాతం 75.3 వరకు ఉంటుంది. గర్భిణి, గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి నిరంతరం ఆక్సిజన్‌ మోతాదులను పర్యవేక్షించే దిశగా తమ అధ్యయనం తొలి అడుగు కాగలదని పరిశోధకులు పేర్కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని