ఆయాసమా? సీవోపీడీ కావొచ్చు
ఒక వయసు దాటాక పనులు చేస్తున్నప్పుడు ఆయాసం వస్తున్నా, విడకుండా దగ్గు వేధిస్తున్నా చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవే తగ్గిపోతాయిలే అనుకుంటుంటారు. లేదూ వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఇవి మామూలేనని భావిస్తుంటారు.
ఒక వయసు దాటాక పనులు చేస్తున్నప్పుడు ఆయాసం వస్తున్నా, విడకుండా దగ్గు వేధిస్తున్నా చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవే తగ్గిపోతాయిలే అనుకుంటుంటారు. లేదూ వృద్ధాప్యంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఇవి మామూలేనని భావిస్తుంటారు. నిజమే. వయసు మీద పడుతున్నకొద్దీ శక్తి తగ్గటం, పనులు కష్టమని అనిపించటం సహజమే. కానీ ఇవి దీర్ఘకాల ఊపిరితిత్తుల జబ్బు క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీవోపీడీ)కూ సంకేతాలు కావొచ్చు. ఇందులో ఊపిరితిత్తులు మనకు అవసరమైనంత గాలిని లోనికి తీసుకోలేవు. చిత్రమేంటంటే- చాలామందికి సీవోపీడీ ఉన్నట్టయినా తెలియకపోవటం. లక్షణాలు మొదట్లో స్వల్పంగా ఉంటాయి. క్రమంగా తీవ్రమవుతూ వస్తుంటాయి. కొందరికి నడుస్తున్నా, ఏదైనా శారీరక శ్రమ చేసినా వెంటనే ఆయాసం ముంచుకొచ్చేస్తుంటుంది. కొందరు విడవకుండా దగ్గుతూ ఉంటారు కూడా. ఛాతీ బిగపట్టినట్టు అనిపించటం, పిల్లికూతల వంటివీ ఉండొచ్చు. తీవ్రమైన అలసట, నిస్సత్తువ సైతం ఆవహిస్తుంటాయి. అయినా కూడా ఎంతోమందికివి సీవోపీడీ లక్షణాలన్న సంగతే తెలియదు. ఇది తీవ్రంగా వేధించేదే అయినా మందులు, జాగ్రత్తలతో అదుపులో ఉంచుకోవచ్చు. ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. హాయిగా పనులు చేసుకోవటానికి, జీవనకాలం పెరగటానికివి తోడ్పడతాయి. అందువల్ల సీవోపీడీ లక్షణాలను గుర్తించటం, అవసరమైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించటం ముఖ్యం.
రెండు రకాలు
సీవోపీడీలో ప్రధానంగా రెండు రకాల జబ్బులు కనిపిస్తుంటాయి.
1. ఎంఫెసీమా. ఇందులో ఊపిరితిత్తుల లోపలి కణజాలం క్షీణిస్తుంది.
2. క్రానిక్ బ్రాంకైటిస్. ఇందులో శ్వాసమార్గాలు చికాకుకు గురవుతాయి. వాపు లక్షణాలూ కనిపిస్తాయి. సీవోపీడీ బారినపడ్డ చాలామందిలో ఇవి రెండూ కలిసే ఉంటాయి.
ముప్పు ఎవరికి?
ప్రధాన ముప్పు కారకం పొగతాగే అలవాటు. అలాగని ఇదే పూర్తిగా కారణం కాదు. సీవోపీడీ బాధితుల్లో సుమారు 25% మంది పొగతాగనివారే. ఇతరులు వదిలిన పొగను పీల్చటం కూడా సీవోపీడీకి దారితీయొచ్చు. వయసు, లింగ భేదం, చేసే పని, నివసించే చోటు వంటివీ దీనికి కారణాలు కావొచ్చు. ఇది మహిళల్లో, 40 ఏళ్లు పైబడినవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఏఏటీ లోపమనే అరుదైన జన్యు సమస్య గలవారికీ దీని ముప్పు ఎక్కువే. రసాయనాల పొగలు, దుమ్ము వంటి వాటికి ఎక్కువకాలం ప్రభావితం కావటంతోనూ ముప్పు పెరగొచ్చు. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారి ఊపిరితిత్తుల్లో ఎంఫెసీమా మాదిరి లక్షణాలు కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
నిర్ధరణ-చికిత్స
సీవోపీడీ నిర్ధరణకు ప్రధాన పరీక్ష స్పైరోమెట్రీ. ఇందులో ఒక గొట్టంలోకి గాలిని ఊదాల్సి ఉంటుంది. దీంతో ఊపిరితిత్తుల సామర్థ్యం బయటపడుతుంది. కొందరికి ఎక్స్‌రే, స్కానింగ్, రక్త పరీక్షల వంటివీ అవసరమవ్వచ్చు. జబ్బు తీవ్రతను గుర్తించటానికివి ఉపయోగపడతాయి. ఇతరత్రా సమస్యలేవైనా కారణమవుతున్నాయేమో కూడా తెలుస్తుంది. సీవోపీడీని నయం చేసే చికిత్సలేవీ లేవు. కానీ జబ్బు త్వరగా ముదరకుండా చూసుకోవచ్చు. శ్వాస మార్గాలను విప్పార్చే, వాపు ప్రక్రియను తగ్గించే మందులతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. పనులు హాయిగా చేసుకోవటానికి వీలవుతుంది. సమస్య తీవ్రమైనవారికి ఆక్సిజన్ చికిత్స అవసరం.
* పొగతాగే అలవాటుంటే మానెయ్యటం, ఇంట్లో ఎవరూ పొగ తాగకుండా చూసుకోవటం ముఖ్యం.
* సీవోపీడీ బాధితులకు పల్మనరీ రిహాబిలిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో శ్వాస తీసుకునే పద్ధతులు.. ఆయాసం తలెత్తకుండా వ్యాయామాలు చేయటం, శరీర సామర్థ్యాన్ని పెంచుకోవటం వంటివి నేర్పిస్తారు. పల్మనరీ రిహాబిలిటేషన్‌తో చాలామంది రోజుకు అరగంట కన్నా ఎక్కువసేపు వ్యాయామం చేసే స్థితికి చేరుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Ap-top-news News
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు