దెబ్బతిన్న గుండెకు స్ప్రే

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధానమైన జబ్బుల్లో గుండెపోటు ఒకటి. అధునాతన శస్త్రచికిత్సలు, నిర్ధరణ పద్ధతులు, మందులు ఎంతోమందిని గుండెపోటు నుంచి బయటపడేస్తున్నాయి. కానీ గుండె కణజాలం శాశ్వతంగా దెబ్బతినటం వల్ల తలెత్తే అనర్థాలు అలాగే వేధిస్తున్నాయి.

Published : 20 Jul 2021 02:12 IST

ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు కారణమవుతున్న ప్రధానమైన జబ్బుల్లో గుండెపోటు ఒకటి. అధునాతన శస్త్రచికిత్సలు, నిర్ధరణ పద్ధతులు, మందులు ఎంతోమందిని గుండెపోటు నుంచి బయటపడేస్తున్నాయి. కానీ గుండె కణజాలం శాశ్వతంగా దెబ్బతినటం వల్ల తలెత్తే అనర్థాలు అలాగే వేధిస్తున్నాయి. వీటితో ఐదేళ్లలోపే ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని తప్పించటానికే శాస్త్రవేత్తలు కొత్తరకం స్ప్రేను రూపొందించారు. దీన్ని చిన్న రంధ్రంతోనే గుండె మీద ప్రవేశపెట్టే వీలుండటం విశేషం. గుండెపోటు అనంతరం దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి వృద్ధి చేయటానికి మూలకణాలు బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని నేరుగా గుండె మీద ప్రవేశపెట్టటం ప్రమాదకరం. రోగనిరోధకశక్తి అతిగా ప్రేరేపితం కావొచ్చు. లేదూ మూలకణాలు అడ్డదిడ్డంగా పెరిగి కణితులకు దారితీయొచ్చు. ఈ ఇబ్బందులను అధిగమించటానికి శాస్త్రవేత్తలు కొత్త ప్రయత్నం చేశారు. మూలకణాల నుంచి విడుదలయ్యే న్యూక్లిక్‌ యాసిడ్‌, ప్రొటీన్లు, కొవ్వులతో నిండిన సూక్ష్మ తిత్తులను రక్తం గడ్డ కట్టటానికి తోడ్పడే ఫిబ్రినోజెన్‌ ప్రొటీన్‌తో కలిపారు. ఈ మిశ్రమాన్ని సూక్ష్మమైన, రెండు గదులు గల సిరంజిలోకి జొప్పించారు. దీని మరో గదిలో థ్రాంబోనిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. చిన్న కోతతో సూదిని జొప్పించి వీటి మిశ్రమాన్ని గుండె కణజాలం మీద చల్లితే రెండూ కలిసిపోయి చిక్కటి జిగురుగా మారతాయి. ఇది కణజాలానికి అతుక్కుపోయి ఎక్కువసేపు అలాగే ఉండిపోతుంది. కణజాలాన్ని సమర్థంగా మరమ్మతు చేస్తుంది. దీనికి రోగనిరోధక ప్రతిస్పందన అంత ఎక్కువగా ఏమీ ఉండటం లేదు కూడా.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని