సూపర్‌ యాంటీబాడీ!

కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 తరగతికి చెందిన అన్నిరకాల కరోనా వైరస్‌లకు ఒకే చికిత్స, ఒకే టీకా అందుబాటులోకి వస్తే? కరోనా పీడ పూర్తిగా విరగడవుతుంది కదా. అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. అన్నిరకాల కరోనా వైరస్‌ల పనిపట్టే యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Published : 20 Jul 2021 02:12 IST

కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 తరగతికి చెందిన అన్నిరకాల కరోనా వైరస్‌లకు ఒకే చికిత్స, ఒకే టీకా అందుబాటులోకి వస్తే? కరోనా పీడ పూర్తిగా విరగడవుతుంది కదా. అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఇలాంటి ఆశలే రేకెత్తిస్తోంది. అన్నిరకాల కరోనా వైరస్‌ల పనిపట్టే యాంటీబాడీని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పేరు ఎస్‌2హెచ్‌97. మొత్తం 12 యాంటీబాడీల మీద అధ్యయనం చేసి దీన్ని కనుగొన్నారు. ఇది అన్నిరకాల కరోనా వైరస్‌ ప్రొటీన్లకు అంటుకుపోయి, కణాల్లోకి విస్తరించకుండా చేస్తుండటం గమనార్హం. అందుకే దీన్ని సూపర్‌ యాంటీబాడీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇది మన కణ గ్రాహకాలకు వైరస్‌ అంటుకుపోయే భాగాన్ని లక్ష్యంగా చేసుకొని పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా వివిధ రకాల వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తోందని వివరిస్తున్నారు. కొన్ని సార్స్‌-కొవీ-2 రకాల వైరస్‌లు యాంటీబాడీల పట్టు నుంచీ తప్పించుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. చికిత్సలు, టీకాల విషయంలో ఇది పెద్ద సవాల్‌గా మారుతోంది. సూపర్‌ యాంటీబాడీ దీనికి పరిష్కార మార్గం చూపగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాదు.. మున్ముందు ఇంకా ఎలాంటి కొత్త కొత్త కరోనా వైరస్‌లు మనపై దాడి చేస్తాయోనని భయపడుతున్న తరుణంలో ఇది నిజంగా శుభవార్తే. అన్నిరకాల వైరస్‌లకు ఒకే టీకా, ఒకే చికిత్స రూపొందించటానికిది వీలు కల్పిస్తుందని ఆశిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని