రక్త క్యాన్సర్‌కు అవకాడో కళ్లెం

ముదురు ఆకుపచ్చ, ఒకింత నలుపు రంగులో కనిపించే అవకాడో పండులో పోషకాలు దండిగా ఉంటాయి. దీంతో 20 రకాల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అంతేనా? ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఆమ్లాల (మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌- ఎంయూఎఫ్‌ఏ) శాతమూ ఎక్కువే. ఇవే ఇప్పుడు పరిశోధకులను ఆకర్షిస్తున్నాయి.

Published : 27 Jul 2021 02:35 IST

ముదురు ఆకుపచ్చ, ఒకింత నలుపు రంగులో కనిపించే అవకాడో పండులో పోషకాలు దండిగా ఉంటాయి. దీంతో 20 రకాల విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. అంతేనా? ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు ఆమ్లాల (మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్స్‌- ఎంయూఎఫ్‌ఏ) శాతమూ ఎక్కువే. ఇవే ఇప్పుడు పరిశోధకులను ఆకర్షిస్తున్నాయి. అవకాడోలో అవకాటిన్‌ బి అనే కొవ్వు అణువులుంటాయి. దీనికి అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకీమియా (ఏఎంఎల్‌) అనే తీవ్ర రక్తక్యాన్సర్‌ కణాలను అడ్డుకునే గుణం ఉండటం విశేషం. అవకాటిన్‌ బి మధుమేహ నివారణ, ఊబకాయ నియంత్రణకు తోడ్పడుతున్నట్టు ఇప్పటికే బయటపడింది. ఇది వీఎల్‌సీడీ ఎంజైమ్‌నూ సమర్థంగా ప్రతిఘటిస్తున్నట్టు తాజాగా గుర్తించారు. రక్తక్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందటంలో, విస్తరించటంలో వీఎల్‌సీఏడీ కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్‌ కణాలు తమ మనుగడ కోసం దీని మీదే ఆధారపడుతుంటాయి. అందుకే దీన్ని రక్తక్యాన్సర్‌ బాధితులపై ప్రత్యక్షంగా పరీక్షించటంపై పరిశోధకులు దృష్టి సారించారు. అక్యూట్‌ మైలాయిడ్‌ ల్యుకీమియా తీవ్రమైన సమస్య. ప్రస్తుతం పెద్దగా చికిత్సలేవీ అందుబాటులో లేవు. దీని బారిన పడ్డవారిలో 10% మందే ఐదేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించ గలుగుతున్నారు. కేవలం సగం మందికే కీమోథెరపీ ఇస్తున్నారు. మిగతావారికి నొప్పులు తగ్గించటం వంటి ఉపశమన చికిత్సలు మాత్రమే చేస్తున్నారు. కీమోథెరపీ తీసుకునేవారిలో చాలామంది చికిత్స మూలంగానే మరణిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అవకాడోలోని అవకాటిన్‌ బి ప్రయోజనాలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని