బరువు తగ్గితేనే గుండెకు మేలు

బరువు అదుపులో ఉంచుకోవటం ఎవరికైనా మంచిదే. గుండెజబ్బులతో బాధపడే ఊబకాయులకు, అధిక బరువు గలవారికైతే ఇది మరింత ముఖ్యం.

Updated : 03 Aug 2021 01:29 IST

రువు అదుపులో ఉంచుకోవటం ఎవరికైనా మంచిదే. గుండెజబ్బులతో బాధపడే ఊబకాయులకు, అధిక బరువు గలవారికైతే ఇది మరింత ముఖ్యం. దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ మోతాదులు తగ్గేలా చూసుకోవచ్చు. మధుమేహాన్ని నివారించుకోవచ్చు. ఫలితంగా రెండోసారి గుండెపోటు బారినపడకుండా కాపాడుకోవచ్చు. అయితే గుండెజబ్బు బాధితుల విషయంలో బరువు తగ్గటంపై అంతగా దృష్టి పెట్టటం లేదని ఐరోపా తాజా అధ్యయనం పేర్కొంటోంది. గుండెపోటు, గుండె రక్తనాళాల పూడికల వంటి సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సమయంలో కేవలం 20% కన్నా తక్కువమందిలోనే శరీర బరువు, ఎత్తుల నిష్పత్తి (బీఎంఐ) మామూలుగా ఉంటోందని పరిశోధకులు గుర్తించారు. అంటే 80% కన్నా ఎక్కువ మంది అధిక బరువు, ఊబకాయం గలవారే అన్నమాట. మరో 16 నెలల తర్వాత పరిశీలించగా ఊబకాయుల్లో 86% మంది ఇంకా ఊబకాయులుగానే ఉంటుండగా.. అధికబరువు గలవారిలో 14% మంది ఊబకాయుల జాబితాలోకి చేరిపోయారు. చిన్నవయసు మహిళల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దాదాపు సగం మంది 55 ఏళ్ల లోపు మహిళలే! మరో ముఖ్యమైన విషయం- మూడింట ఒకవంతు మంది ఊబకాయులకు శారీరక శ్రమ, ఆహారం గురించి ఎలాంటి జాగ్రత్తలు తెలియకపోవటం. ప్రతి ఐదుగురిలో ఒకరికి తాము అధిక బరువుతో ఉన్నామన్న సంగతే తెలియటం లేదు. ఊబకాయాన్ని తీవ్ర సమస్యగా పరిగణించటం లేదనటానికిదే నిదర్శనమని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని, బరువు విషయంలో అలసత్వం పనికిరాదని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని