గుండెపోటు నటనే సమస్యగా మారింది

నా చిన్నప్పుడు ఒకతను గుండెపోటుతో చనిపోయారు. అది చూసి నాక్కూడా గుండెపోటు వస్తే ఇలాగే చనిపోతాను కదా అనే భయం పట్టుకుంది.

Updated : 03 Aug 2021 01:33 IST

సమస్య: నా చిన్నప్పుడు ఒకతను గుండెపోటుతో చనిపోయారు. అది చూసి నాక్కూడా గుండెపోటు వస్తే ఇలాగే చనిపోతాను కదా అనే భయం పట్టుకుంది. దీంతో ఒత్తిడి కలిగించే విషయం ఏదైనా వింటే బాగా భయపడి, గుండెపోటు వచ్చినట్టుగా నటిస్తూ, ఛాతీని బిగపడుతూ ఉండేవాడిని. సమస్యకు పరిష్కారం దొరికితే ఒత్తిడి పోయి, గుండెపోటు తగ్గినట్టుగా భావించుకునేవాడిని. పరిష్కారం దొరక్కపోతే ఛాతీని బిగపట్టటం వదిలేవాడిని కాదు. క్రమంగా ఇదొక అలవాటుగా మారిపోయింది. ప్రతి ప్రతికూల ఆలోచనకు భయపడటం, ఛాతీని బిగపట్టటం అలవాటైంది. ఆ సమయంలో భుజం కండరాన్ని బిగపడుతున్నట్టూ నాకు తెలియటం లేదు. దాదాపు 12 ఏళ్లుగా దీంతో బాధపడుతున్నాను. మందులు వాడినప్పుడు తగ్గుతుంది. మందులు వేసుకోకపోతే మళ్లీ వస్తుంది. ధ్యానం కూడా చేస్తున్నాను. ధ్యానం చేయకపోయినా, మందులు వేసుకోకపోయినా నేను పడే బాధ వర్ణనాతీతం. దీన్నుంచి బయటపడే మార్గమేది?

- వి.రాజు (ఈమెయిల్‌)

సలహా: మీరు దీర్ఘకాల ఆందోళన (క్రానిక్‌ ఆంగ్జయిటీ) సమస్యతో బాధపడుతున్నారని అనిపిస్తోంది. కొందరిలో దీన్ని మాల్‌అడాప్టివ్‌ బిహేవియర్‌ అనీ అంటారు. అంటే ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దానికి అసలైన పరిష్కారాన్ని వెతకటం కన్నా తప్పించుకునే మార్గాల కోసం చూడటం. ఇబ్బందికరమైన ఆలోచనలు, భావోద్వేగాల నుంచి తప్పించుకోవటానికి విచిత్రమైన అలవాట్లను అలవరచుకోవటం దీని ప్రత్యేకత. మీరు కూడా ఒత్తిడికి గురిచేసే విషయాలను విన్నప్పుడు అసలైన పరిష్కారం కోసం కాకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా గుండెపోటు వచ్చినట్టు నటించటం అలవాటు చేసుకున్నారు. దీర్ఘకాల ఆందోళనతో బాధపడుతున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని ఎదుర్కొనే ధైర్యముండదు. దీంతో ఆందోళన మరింత ఎక్కువై కండరాలు బిగపట్టటం వంటి సమస్యలు తలెత్తుతాయి. మీ విషయంలోనూ ఇదే జరిగింది. క్రమంగా జీవితంలో ఇదొక భాగంగా మారిపోయింది. ఇలాంటి ధోరణి మొదట్లో కాస్త ఉపశమనం కలిగించినా అలవాటుగా మారటంతో సమస్య పెద్దదైంది. సమస్యకు పరిష్కారం దాన్ని ఎదుర్కోవటమే కానీ తప్పించుకోవటం కాదని అర్థం చేసుకోవాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యకు మందుల కన్నా కౌన్సెలింగ్‌ ప్రధానం. ఇటువంటి సమస్యల్లో మందులు తాత్కాలిక ఉపశమనమే కలిగిస్తాయి. కౌన్సెలింగ్‌ ద్వారా శాశ్వతంగా తగ్గించుకునే అవకాశముంది. ఇందులో తప్పించుకునే మార్గాలను అన్వేషించే ధోరణిని మార్చుకునేలా తర్ఫీదు ఇస్తారు. ఒత్తిడి ఎదురైనప్పుడు ఇతర మార్గాల్లో ఎదుర్కోవటం నేర్పిస్తారు. ఇలా ఆలోచనా విధానాన్ని మారుస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా దగ్గర్లోని మానసిక నిపుణులను సంప్రదించండి. తగు పరిష్కారం సూచిస్తారు. సమస్య తీవ్రమైతే కెరీర్‌, సంబంధాలు, ఆసక్తులు, హాబీల వంటి వాటిని గణనీయంగా దెబ్బతీస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని