రక్తపోటు మందులు వేసుకోవచ్చా?

నాకు 69 ఏళ్లు. మధుమేహం లేదు. రక్తపోటు (బీపీ) 130/80 ఉంటుంది. డాక్టర్‌కు చూపిస్తే బీపీ మాత్రలు రాశారు. మాత్ర వేసుకుంటే బీపీ 110/80కి తగ్గుతోంది. ఇదేమైనా లో బీపీనా?

Updated : 10 Aug 2021 05:42 IST

సమస్య: నాకు 69 ఏళ్లు. మధుమేహం లేదు. రక్తపోటు (బీపీ) 130/80 ఉంటుంది. డాక్టర్‌కు చూపిస్తే బీపీ మాత్రలు రాశారు. మాత్ర వేసుకుంటే బీపీ 110/80కి తగ్గుతోంది. ఇదేమైనా లో బీపీనా? ఇంతకుముందు నేను లో బీపీతో చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నేను మాత్రలు వేసుకోవచ్చా?

- జి.అచ్చిరెడ్డి, మహబూబ్‌నగర్‌

సలహా: మీరు పూర్తి వివరాలు తెలియజేయలేదు. మాత్రలు మొదలు పెట్టటానికి ముందు రక్తపోటు ఎంత ఉందన్నది ముఖ్యం. సాధారణంగా బీపీ 130/80 లోపు ఉండటం మంచిది. నిరంతరం రక్తపోటు ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంటే చికిత్స అవసరమవుతుంది. అదీ ఒకసారి బీపీ పరీక్షతోనే సమస్యను నిర్ధరించరు. కొద్ది రోజుల వ్యవధిలో రెండు, మూడు సార్లు పరీక్షించి.. అన్నిసార్లూ రక్తపోటు ఎక్కువగా నమోదవుతుంటేనే సమస్య ఉన్నట్టుగా నిర్ధరిస్తారు. అప్పుడు సైతం మొదట్లోనే మాత్రలు ఇవ్వరు. ముందుగా ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం, వ్యాయామం చేయటం వంటి జీవనశైలి మార్పులను సూచిస్తారు. వీటిని పాటిస్తున్నా రక్తపోటు ఎక్కువగా ఉంటేనే మాత్రలు ఆరంభిస్తారు. మీ వయసును బట్టి చూస్తే రక్తపోటు ముందు/పై సంఖ్య 130-110, చివరి/కింది సంఖ్య 60-80 ఉండటం నార్మలే. అందువల్ల మీకు మాత్రలు ఆరంభించటానికి ముందు రక్తపోటు ఎంత ఉందన్నది కీలకం. ముందు నుంచే మీకు బీపీ 130/80 ఉన్నట్టయితే దీనికి మాత్రలు అవసరం లేదు. మీకు డాక్టర్‌ మాత్రలు సూచించారంటే అప్పటికి రక్తపోటు ఎక్కువగా ఉండి ఉండాలి. ఒకవేళ మాత్రలు వేసుకోవటం ఆరంభించటానికి ముందు ఇంతకన్నా ఎక్కువుండి, ఆరంభించాక తగ్గినట్టయితే క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో మానెయ్యటం తగదు. సాధారణంగా మాత్రలు వేసుకుంటుంటే రక్తపోటు తగ్గుతుంది. ఇది మాత్రల ప్రభావమే గానీ సమస్య తగ్గటం కాదని గుర్తుంచుకోవాలి. మాత్రలు మానేస్తే రక్తపోటు మళ్లీ పెరుగుతుంది. ఇది సమస్యలకు దారితీస్తుంది. ఇక లో బీపీ విషయానికి వస్తే- లేచి నిల్చున్నప్పుడు కళ్లు తిరగటం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాలి. డాక్టర్‌ దృష్టికి తీసుకురావాలి. సొంత నిర్ణయంతో మందులు ఆపెయ్యరాదు. ఇలాంటి సమయంలోనూ ముందుగా మాత్రల మోతాదు తగ్గించి పరిశీలిస్తారు. అంతే తప్ప మొత్తానికే మందులు ఆపెయ్యరని తెలుసుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని