Published : 17 Aug 2021 02:08 IST

బాలలు బ్రహ్మాండంగా..

పిల్లలను కాపాడుకోవాలనే నిరంతరం కోరుకుంటాం. జబ్బులు, ఇన్‌ఫెక్షన్ల బారినపడకూడదనే భావిస్తుంటాం. రోగనిరోధకశక్తి బలంగా ఉంటే వీటిని చాలావరకు దూరంగా ఉంచుకోవచ్చు. ఇందుకు చిన్నప్పట్నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవటం, పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించటం ఎంతైనా అవసరం. ఇవి చాలావరకు మన ఇంగిత జ్ఞానంతో ముడిపడినవే.

శిశువులకు తల్లిపాలు

మన రోగనిరోధకశక్తి పుట్టిన తొలినాళ్ల నుంచే రూపుదిద్దుకోవటం ఆరంభిస్తుంది. ఇందులో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా తల్లి నుంచి బిడ్డకు యాంటీబాడీలు అందుతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయటానికి పునాదినీ వేస్తాయి. అందుకే శిశువులకు కనీసం ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టటం మంచిది. ఇవి అలర్జీలు రాకుండానూ కాపాడతాయి.

చేతుల శుభ్రత ప్రాముఖ్యత

సుమారు 80% ఇన్‌ఫెక్షన్లు తాకటం ద్వారానే సంక్రమిస్తాయి. కాబట్టి తుమ్మిన, దగ్గిన తర్వాత.. బాత్రూమ్‌కు వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవటం చిన్నప్పట్నుంచే అలవాటు చేయాలి. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుకొని, చేతులు కడుక్కుంటే బ్యాక్టీరియా, వైరస్‌ల బారినపడకుండా కాపాడుకోవచ్చు. ఒక్క చేతుల శుభ్రతతోనే 45% వరకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను నివారించుకోవచ్చు.

టీకాలు సక్రమంగా

టీకా అంటేనే భరోసా. జబ్బుల బారినపడకుండా కాపాడే మంచి తంత్రం. అందువల్ల పుట్టిన తొలిరోజున వేయించే బీసీజీ టీకా దగ్గర్నుంచి 9 ఏళ్లు దాటాక వేయించే టీడ్యాప్‌, బాలికలకు ప్రత్యేకించిన హెచ్‌పీవీ టీకా వరకూ.. అన్నింటినీ క్రమం తప్పకుండా వేయించాలి. వేటినీ వదిలేయొద్దు. ప్రభుత్వ టీకా కార్యక్రమంలో లేకపోయినా ఆరో నెలలో పిల్లలకు ఫ్లూ టీకా ఇప్పించాలి. నెల తర్వాత మరో మోతాదు, అనంతరం ఏటా ఒక మోతాదు ఇప్పించాలి. ఆస్థమా, ఇతర దీర్ఘకాల సమస్యలు గలవారికిది మరింత ముఖ్యం.

నిద్ర ప్రధానం

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటానికి, అది సక్రమంగా పని చేయటానికి కంటి నిండా నిద్ర తప్పనిసరి. ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి, వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తగ్గటానికి సైటోకైన్లనే ప్రొటీన్లు తోడ్పడతాయి. తగినంత నిద్ర లేకపోతే ఇవి అంతగా పుట్టుకురావు. పిల్లలకు ఎంత నిద్ర అవసరమన్నది వయసును బట్టి ఆధారపడి ఉంటుంది.

మంచి ఆహారం తోడు

పిల్లల రోగనిరోధకవ్యవస్థ సమర్థంగా పనిచేయటానికి అన్ని పోషకాలతో కూడిన మంచి ఆహారం తప్పనిసరి. రంగురంగుల కూరగాయలు, పండ్లు తినిపించాలి. చిన్నప్పట్నుంచే పొట్టుతీయని నిండు గింజ ధాన్యాలు అలవాటు చేయాలి. వీటితో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాల వంటివన్నీ మంచి ఆరోగ్యానికి, బలమైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పడతాయి. చిప్స్‌ వంటి చిరుతిళ్లు తక్కువగా తినేలా చూసుకోవాలి. వీలైనంతవరకు వీటికి దూరంగా ఉండటం మంచిదనే విషయం అవగతమయ్యేలా చూడాలి. బాల్యంలోనే ఆరోగ్యకరమైన ఆహారం తినటం అలవాటు చేస్తే జీవితాంతం పాటించటానికి మార్గం వేసినట్టు అవుతుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని