పదే పదే పొలమారుతుందేం?

నాకు 68 ఏళ్లు. మధుమేహం, అధిక రక్తపోటు, కుంగుబాటు మందులు వాడుతున్నాను. ఒక సంవత్సరం నుంచి నాకు భోజనం చేసినప్పుడు, నీళ్లు తాగినప్పుడే కాదు పడుకున్నప్పుడూ తరచూ...

Updated : 31 Aug 2021 06:34 IST

సమస్య: నాకు 68 ఏళ్లు. మధుమేహం, అధిక రక్తపోటు, కుంగుబాటు మందులు వాడుతున్నాను. ఒక సంవత్సరం నుంచి నాకు భోజనం చేసినప్పుడు, నీళ్లు తాగినప్పుడే కాదు పడుకున్నప్పుడూ తరచూ పొలమారుతోంది. అప్పుడు గుక్క తిప్పుకోలేక, ఊపిరాడక ప్రాణం పోయినంత పనవుతుంది. అది తగ్గిన తర్వాత గంటసేపు బాగా దగ్గు కూడా వస్తుంది. ఇలా 10 రోజులకోసారి జరుగుతోంది. ఇదేమైనా అనారోగ్యమా? పరిష్కారమార్గమేంటి?

- రామలక్ష్మి, హైదరాబాద్‌

సలహా: తినే ఆహారం, తాగే నీళ్లు అన్నవాహికలోకి కాకుండా స్వరపేటికలోకి వెళ్తే వెంటనే దగ్గు వస్తుంటుంది. దీన్నే పొలమారటం అంటుంటాం. సాధారణంగా మనం ఏదైనా మింగుతున్నప్పుడు స్వరపేటిక మీద ఎపిగ్లాటిస్‌ పడగలాగా పరచుకొని, మూసేస్తుంది. అప్పుడు స్వరపేటిక పక్కల నుంచి ఆహారం అన్నవాహికలోకి వెళ్తుంది. ఒకవేళ అన్నం, నీళ్ల వంటివి అన్నవాహికలోకి కాకుండా స్వరపేటికలోకి ప్రవేశిస్తే వెంటనే దగ్గు వస్తుంది. ఎపిగ్లాటిస్‌ చాలా సున్నితమైంది. దీనికి మెతుకులు, నీళ్ల వంటివి తగిలినా దగ్గు వస్తుంది. అయితే మీరు భోజనం చేస్తున్నప్పుడు, నీళ్లు తాగుతున్నప్పుడే కాదు.. పడుకున్నప్పుడూ పొలమారుతోందని అంటున్నారు. ఇందుకు చాలావరకు జీర్ణాశయంలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని రావటం (రిఫ్లక్స్‌) కారణమై ఉండొచ్చని అనిపిస్తోంది. దీనికి ఆహారం, తిండి వేళలను మార్చుకోవటం బాగా ఉపయోగపడుతుంది. సాయంత్రం 7 గంటల కల్లా రాత్రి భోజనం ముగించెయ్యాలి. అంటే పడుకునే సమయానికి తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చూసుకోవాలన్నమాట. పడుకున్నప్పుడు దిండు పెట్టుకొని తల ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. మసాలాలు, పులుపు, కారం పదార్థాలు తగ్గించాలి. పాలు, పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే ముక్కు, చెవి, గొంతు (ఈఎన్‌టీ) నిపుణులను సంప్రదించండి. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుల సలహా కూడా అవసరమవ్వచ్చు. కొందరు వృద్ధుల్లో నిద్రపోతున్నప్పుడు నోట్లో లాలాజలం పోగుపడి స్వరపేటికలోకి వెళ్లటంతోనూ దగ్గు వచ్చే అవకాశముంది. మీరు ఇతరత్రా లక్షణాల గురించి తెలియజేయలేదు. ఇవి చాలా ముఖ్యం. మాట బొంగురు పోయినట్టయితే స్వరతంత్రుల్లో ఒకటి బలహీనపడటం (వోకల్‌ కార్డ్‌ పెరాలిసిస్‌) కారణం కావొచ్చు. దీంతో స్వరపేటిక సరిగా మూసుకోదు. నీళ్లు తాగినా, ఏదైనా తిన్నా దగ్గు వస్తుంది. దీన్ని ఎండోస్కోపీ పరీక్ష ద్వారా గుర్తించొచ్చు. సమస్య ఉన్నట్టయితే తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. సరిగా మింగటానికి కొన్ని వ్యాయామాలూ ఉపయోగపడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని