పిల్లలపై డెల్టా కరుణ

డెల్టా రకం సార్స్‌-కొవీ-2 చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇది చిన్నారులకు తీవ్రంగా పరిణమిస్తుందనే భయాలూ నెలకొన్నాయి. నిజానికి దీని విజృంభణతో పిల్లల్లోనూ కరోనా కేసులు పెరిగాయి.

Updated : 07 Sep 2021 04:36 IST

డెల్టా రకం సార్స్‌-కొవీ-2 చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇది చిన్నారులకు తీవ్రంగా పరిణమిస్తుందనే భయాలూ నెలకొన్నాయి. నిజానికి దీని విజృంభణతో పిల్లల్లోనూ కరోనా కేసులు పెరిగాయి. కానీ అంత తీవ్రమైన జబ్బును కలిగించటం లేదని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధ్యయనం పేర్కొంటోంది. గత సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఆగస్టు వరకు కరోనాతో ఆసుపత్రిలో చేరిన పిల్లల వివరాలను ఇందులో పరిశీలించారు. 5-11 ఏళ్ల పిల్లలతో పోలిస్తే 0-4 ఏళ్లు, 12-17 ఏళ్ల వయసు వారికి ఆసుపత్రిలో చేరే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. అయితే ఐసీయూలో చేర్చాల్సి వచ్చినవారి శాతం మునుపటి కన్నా తక్కువే ఉంటున్నట్టు తేలింది. డెల్టా వైరస్‌కు ముందు ఆసుపత్రిలో చేరినవారిలో 26.5% మంది ఐసీయూలో చేరగా.. డెల్టా అనంతరం 23.2% మందికి అత్యవసర చికిత్స అవసరమైనట్టు బయటపడింది. గమనించాల్సిన విషయం ఏంటంటే- డెల్టాకు ముందు తక్కువ మంది పిల్లలు ఆసుపత్రిలో చేరగా ఇప్పుడు ఎక్కువ మంది చేరటం. టీకా తీసుకున్న యుక్తవయసు పిల్లలతో పోలిస్తే టీకా తీసుకోనివారు సుమారు 10% ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. పిల్లలకూ టీకా అవసరముందనే విషయాన్ని ఇది చెప్పకనే చెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని