నడకతో ఆయుష్షు

ఆయుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు. వీలైనంత ఎక్కువ నడిస్తే చాలు. రోజుకు సుమారు 7వేల అడుగులు నడిచేవారికి అన్ని రకాల కారణాలతో

Published : 07 Sep 2021 01:13 IST

యుష్షు పెంచుకోవాలని అనుకుంటున్నారా? పెద్దగా ఏమీ చేయనక్కర్లేదు. వీలైనంత ఎక్కువ నడిస్తే చాలు. రోజుకు సుమారు 7వేల అడుగులు నడిచేవారికి అన్ని రకాల కారణాలతో సంభవించే మరణం ముప్పు 50% నుంచి 70% వరకు తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ అధ్యయనం పేర్కొంటోంది. అదే 10వేల అడుగులు నడిస్తే ఇంకాస్త ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. అలాగని ఎక్కువ వేగం అవసరం లేదు. మామూలు వేగంతో నడిచినా చాలు. ఎక్కువ వేగం మరణం ముప్పుపై ఎలాంటి ప్రభావం చూపటం లేదనీ బయటపడింది. పరిశోధకులు 11 ఏళ్ల పాటు నడక తీరుతెన్నులను పరిశీలించి మరీ దీన్ని గుర్తించారు. నడకను ప్రోత్సహించటానికి మనం రోజుకు ఎన్ని అడుగులు వేస్తున్నామన్నది లెక్కించే పరికరాలు ఎంతగానో ఉపయోగపడగలవని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికిది తేలికైన, సులభమైన మార్గమని వివరిస్తున్నారు. వ్యాయామంతో రక్తపోటు, కొలెస్ట్రాల్‌ తగ్గుతాయి. గ్లూకోజు, బరువు నియంత్రణలో ఉంటాయి. ఇవన్నీ గుండె జబ్బు ముప్పును తగ్గించేవే. ఇందుకు కష్టమైన కసరత్తులే అవసరం లేదని, క్రమం తప్పకుండా రోజూ నడిచినా చాలని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. అందరూ 10వేల అడుగులు నడవలేకపోవచ్చు. మునుపటి రోజు కన్నా కాస్త ఎక్కువ సేపు నడిచేలా చూసుకుంటే కొద్దిరోజుల్లోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని