వైప్స్‌ వాడకం సరిగా..

కరోనా విజృంభణతో క్రిములను చంపే వైప్స్‌ వాడకం బాగా పెరిగింది. కానీ అన్నీ వైరస్‌లను చంపకపోవచ్చు. బెంజాల్‌కోనియం క్లోరైడ్‌తో తయారైన వైప్స్‌ బ్యాక్టీరియాను మాత్రమే చంపుతాయి.

Updated : 07 Sep 2021 04:32 IST

కరోనా విజృంభణతో క్రిములను చంపే వైప్స్‌ వాడకం బాగా పెరిగింది. కానీ అన్నీ వైరస్‌లను చంపకపోవచ్చు. బెంజాల్‌కోనియం క్లోరైడ్‌తో తయారైన వైప్స్‌ బ్యాక్టీరియాను మాత్రమే చంపుతాయి. వైరస్‌లను చంపలేవు. అదే డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ వైప్స్‌ అయితే బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లనూ నిర్మూలిస్తాయి. వీటి వాడకంలో జాగ్రత్త అవసరం. తప్పులు చేయొద్దు.

శుభ్రం చేసిన తర్వాతే: చాలా వైప్స్‌ ఉపరితలాలను శుభ్రం చేయటంతో పాటు క్రిములనూ నిర్మూలిస్తాయి. కానీ ఎక్కువ మురికిగా ఉంటే అంత సమర్థంగా పని చేయకపోవచ్చు. కాబట్టి మురికిగా ఉంటే ముందుగా సబ్బు నీటితో లేదా క్లీనర్‌తో శుభ్రం చేశాకే వైప్స్‌తో తుడవాలి.

ఆట వస్తువులను తుడవద్దు: పిల్లలు ప్రతి దాన్నీ నోట్లో పెట్టుకుంటారు. కాబట్టి ఆట వస్తువులను డిస్‌ఇన్‌ఫెక్టెంట్లు, యాంటీబ్యాక్టీరియల్‌ వైప్స్‌తో తుడవద్దు. వీటికి బదులు తేలికైన సబ్బు నీటితో శుభ్రం చేయాలి.

అతి వేడి తగలనీయొద్దు: వైప్స్‌ను గది ఉష్ణోగ్రతలో భద్ర పరచుకోవాలి. వాతావరణం చల్లగా ఉంటే కారులో పెట్టుకుంటే ఇబ్బందేమీ ఉండదు. కానీ వేసవి కాలంలోనైతే త్వరగా పొడి బారతాయి.

మెత్తని వాటిపై వద్దు: సోఫా వస్త్రాలు, తివాచీల వంటి వాటిని వైప్స్‌తో శుభ్రం చేయొద్దు. ఇవి వైప్స్‌లోని తేమను లాగేస్తాయి. దీంతో వాటిల్లోని రసాయనాలు పనిచేసేంత వరకు తడిగా ఉండవు. స్టీలు, ప్లాస్టిక్‌ లాంటి గట్టిగా, నున్నగా ఉండే వస్తువుల మీద వైప్స్‌ బాగా పనిచేస్తాయి. సార్స్‌-కొవీ-2 వంటి వైరస్‌లు ఎక్కువసేపు ఉండేది ఇలాంటి వీటి మీదే.

తగినంత వరకే వాడాలి: ఒకే వైప్‌తో చాలా వస్తువులు తుడవటం తగదు. ఇవి మరీ పొడిబారితే ఒక చోటు నుంచి మరొక చోటుకు క్రిములు వ్యాపించే ప్రమాదముంది. ఒక వైప్‌తో ఎంతవరకు తుడవచ్చనేది కచ్చితంగా తెలియదు. కానీ తగినంత తడిగా ఉంటే రెండు చదరపు అడుగుల వరకు బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఒకే దాంతో  రెండు మూడు తలుపుల పిడిలు లేదా లైటు స్విచ్చులను తుడిస్తే ఫర్వాలేదని అనుకోవచ్చు.

ఫోన్లను అతిగా తుడవద్దు: వైప్స్‌తో స్మార్ట్‌ఫోన్లను తుడిస్తే ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కానీ మరీ అతిగా వద్దు. ఇది ఫింగర్‌ ప్రింట్‌ రెసిస్టెంట్‌ పొరను దెబ్బతీయొచ్చు. తుడవటానికి వీలైన కవర్‌ను తెర మీద అమర్చుకుంటే మంచిది. ఒకవేళ వైప్స్‌తో తుడవాలనుకుంటే ఫోన్‌ వెలుపలి రంధ్రాలకు తేమ తగలకుండా చూసుకోవాలి.

మరీ ఎక్కువ శానిటైజేషన్‌ తగదు: ఇంట్లో ఎవరైనా జబ్బు పడితే తలుపుల పిడి వంటివి శుభ్రం చేయటం తప్పనిసరి. అలాగని ఇంట్లో ప్రతి వస్తువునూ వైప్స్‌తో శుభ్రం చేయటం మంచిది కాదు. సూక్ష్మక్రిములను చంపే రసాయనాలను మరీ ఎక్కువగా వాడితే మంచి బ్యాక్టీరియా సైతం నశిస్తుంది. ఇది మొండి సూక్ష్మక్రిములు పెరిగేలా చేస్తుంది.

పాతవి వాడొచ్చు గానీ: సాధారణంగా ఒకసారి వాడి పారేసే వైప్స్‌ కాలం చెల్లిపోదు. కొన్ని కంపెనీలు ఎప్పటికైనా పనిచేస్తాయని చెబుతుంటాయి. కానీ కొన్ని కంపెనీలు తయారైన తర్వాత ఒకట్రెండు సంవత్సారాల లోపే వాడుకోవాలని సూచిస్తుంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ రసాయనాలు క్షీణిస్తుంటాయి. దీంతో వైప్స్‌ పొడిబారుతుంటాయి. తేమ లేకపోతే క్రిములను చంపలేవని తెలుసుకోవాలి.

చేతులు తుడుచుకోవద్దు: కొన్ని యాంటీబ్యాక్టీరియా వైప్స్‌తో చేతులు తుడుచుకోవచ్చు గానీ డిస్‌ఇన్‌పెక్టెంట్‌  వైప్స్‌తో తుడుచుకోవద్దు. ఇవి అలర్జీ కలిగించొచ్చు. దీంతో చర్మం ఎరుపు, దురద, వాపు తలెత్తొచ్చు. కఠినమైన రసాయనాలైతే పిల్లల చేతులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని