Published : 28 Sep 2021 01:48 IST

చేతి వణుకెందుకు?

చేతుల వణుకు అనగానే పార్కిన్సన్స్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ వంటి జబ్బులే గుర్తుకొస్తాయి. ఇలాంటి తీవ్రమైన సమస్యలే కాదు. ఇతరత్రా కారణాలతోనూ చేతులు వణకొచ్చు.

* థైరాయిడ్‌ జబ్బు: చేతులు వణకటం కొన్నిసార్లు హైపర్‌థైరాయిడిజమ్‌ సంకేతం కావొచ్చు. థైరాయిడ్‌ హార్మోన్‌ అవసరమైన దాని కన్నా ఎక్కువెక్కువగా ఉత్పత్తి అయితే జీవక్రియల వేగం బాగా పెరుగుతుంది. దీంతో ఒంట్లోని ప్రతి కణంలో శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా నాడులు అతిగా స్పందిస్తాయి. ఇది చేతులు వణకటానికి కూడా దారితీస్తుంది.

* అతిగా కెఫీన్‌: కాఫీ హుషారును కలిగిస్తుంది. చురుకుదనాన్ని పెంచుతుంది. రోజుకు ఒకట్రెండు కప్పులు తాగితే ఇబ్బందేమీ ఉండదు. శ్రుతి మించితేనే చిక్కులు. అతిగా కెఫీన్‌ తీసుకుంటే చేతులు వణికేలా చేస్తుంది. ఒక్క కాఫీలోనే కాదు.. చాక్లెట్లు, కూల్‌డ్రింకులు, కొన్నిరకాల మందుల్లోనూ కెఫీన్‌ ఉంటుంది.

* నిద్రలేమి: నిద్ర సరిగా పట్టకపోతే మెదడు నుంచే అందే సంకేతాలూ అస్తవ్యస్తమవుతాయి. ఇది చేతుల వణుకుకూ దారితీయొచ్చు. అదృష్టవశాత్తు- కంటి నిండా నిద్రపోయేలా చూసుకుంటే వణకు సైతం తగ్గిపోతుంది.

* గ్లూకోజు తగ్గటం: కండరాలు, నాడులు పనిచేయటానికి గ్లూకోజు అత్యవసరం. వీటికి తగినంత గ్లూకోజు అందకపోతే చేతులు వణకొచ్చు. మధుమేహుల్లో కొన్నిసార్లు రక్తంలో గ్లూకోజు బాగా పడిపోవటం చూస్తూనే ఉంటాం. మధుమేహంతోనే కాదు.. కొన్ని రకాల మందులు, అతిగా మద్యం తాగటం, తగినంత ఆహారం తినకపోవటంతోనూ గ్లూకోజు మోతాదులు పడిపోయే ప్రమాదముంది.

* పొగ తాగటం: ఒత్తిడి తగ్గటానికి కొందరు సిగరెట్లు, బీడీలు, చుట్టలు ముట్టిస్తుంటారు. ఒత్తిడి తగ్గటం మాట అటుంచితే ఇవి ఆందోళనకూ దారితీస్తుంటాయి. పొగాకులోని నికొటిన్‌ రక్తంలోకి చేరుకొని గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఇది ఆందోళనకు, చేతులు వణకటానికీ కారణమవుతుంది.

* విటమిన్‌ బి12 లోపం: నాడీ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి విటమిన్‌ బి12 చాలా చాలా అవసరం. ఇది లోపిస్తే నాడుల పనితీరు అస్తవ్యస్తమై చేతుల వణుకు, కాళ్లు చేతులు మొద్దుబారటం, తిమ్మిర్ల వంటివి తలెత్తుతాయి.

* కాలేయ జబ్బులు: విల్సన్స్‌ డిసీజ్‌ వంటి కొన్నిరకాల కాలేయ జబ్బులతోనూ చేతులు వణకొచ్చు. విల్సన్స్‌ డిసీజ్‌ జన్యుపరంగా తలెత్తే సమస్య. ఇందులో ఒంట్లో రాగి పోగు పడుతూ వస్తుంటుంది. ఇది కాలేయం, మెదడును సైతం దెబ్బతీస్తుంది. దీని బారినపడ్డవారిలో అలసట, కామెర్ల వంటి సమస్యలూ బయలుదేరుతుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు