ఆనంద జ్ఞాపకం

మలివయసులో మతిమరుపు బారినపడకూడదని కోరుకుంటున్నారా? అయితే ముందు నుంచే జీవితాన్ని ఆనందంగా గడిపేలా చూసుకోండి. ఇరవైల్లో కుంగుబాటు (డిప్రెషన్‌) లక్షణాలు ఎక్కువగా గలవారికి మున్ముందు విషయగ్రహణ సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం 73% అధికంగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సాన్‌ఫ్రాన్సిస్కో

Updated : 12 Oct 2021 03:17 IST

లివయసులో మతిమరుపు బారినపడకూడదని కోరుకుంటున్నారా? అయితే ముందు నుంచే జీవితాన్ని ఆనందంగా గడిపేలా చూసుకోండి. ఇరవైల్లో కుంగుబాటు (డిప్రెషన్‌) లక్షణాలు ఎక్కువగా గలవారికి మున్ముందు విషయగ్రహణ సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం 73% అధికంగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సాన్‌ఫ్రాన్సిస్కో అధ్యయనంలో వెల్లడైంది మరి. మలివయసులోనూ కుంగుబాటు గలవారికి 43% ఎక్కువగా జ్ఞాపకశక్తి తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. కుంగుబాటుతో మతిమరుపు ముప్పు ఎందుకు పెరుగుతుందనేగా మీ సందేహం? ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఒత్తిడి హార్మోన్ల గురించే. మనం ఒత్తిడికి గురైనప్పుడు దీనికి ప్రతిస్పందించే వ్యవస్థ అతిగా స్పందిస్తుంది. ఫలితంగా గ్లూకోకార్టికాయిడ్లనే హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మెదడులో కొత్త జ్ఞాపకాలు ఏర్పడటానికి, స్థిరపడటానికి, విడమర్చుకోవటానికి కీలకమైన హిప్పోక్యాంపస్‌ భాగాన్ని దెబ్బతీస్తాయి. కుంగుబాటుతో హిప్పోక్యాంపస్‌ కుంచించుకుపోతున్నట్టు, మహిళల్లో ఇది ఇంకాస్త త్వరగానూ క్షీణిస్తున్నట్టు ఇతర అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఒకసారి డిమెన్షియా మొదలైతే ముదరటమే తప్ప తగ్గే అవకాశం లేదు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త పడటం మేలు. ఏ వయసులోనైనా కుంగుబాటు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవటం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని