ఏంటీ కండర బలహీనత?

నాకు 26 ఏళ్లు. గత ఏడేళ్లుగా హైపోకాలమిక్‌ పీరియాడిక్‌ పెరాలసిస్‌తో బాధపడుతున్నాను. ఇది తగ్గదెలా? నాడులు, కండరాలు బలం పుంజుకోవటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Published : 19 Oct 2021 01:19 IST

సమస్య: నాకు 26 ఏళ్లు. గత ఏడేళ్లుగా హైపోకాలమిక్‌ పీరియాడిక్‌ పెరాలసిస్‌తో బాధపడుతున్నాను. ఇది తగ్గదెలా? నాడులు, కండరాలు బలం పుంజుకోవటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

- పి. పరశురాములు (ఈమెయిల్‌)

సలహా: ఇదో అరుదైన నాడీ-కండరాల సమస్య. నొప్పేమీ లేకుండా ఉన్నట్టుండి కండరాలను బలహీనపరుస్తుంది. దీనికి మూలం రక్తంలో పొటాషియం మోతాదులు తగ్గటం. నాడీ ప్రచోదనాల ప్రసారానికి, కండరాల సంకోచ వ్యాకోచాలకు పొటాషియం అత్యవసరం. ఇది లోపించినప్పుడు హఠాత్తుగా కండరాలు బలహీనపడతాయి (హైపోకాలమిక్‌ పీరియాడిక్‌ పెరాలసిస్‌). దీంతో తాత్కాలికంగా కాళ్లు, చేతులు కదలించలేక ఇబ్బంది పడతారు. ఇలా కొద్ది గంటల నుంచి కొన్నిరోజుల వరకు ఉండొచ్చు. కొందరికి ప్రతిరోజూ ఇది దాడి చేయొచ్చు. కొందరికి కొద్ది వారాలు, నెలలకు ఒకసారి రావొచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉందో లేదో తెలియజేయలేదు. ఎందుకంటే ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నట్టయితే జన్యుపరీక్ష అవసరం లేదు. పొటాషియం మోతాదులు తక్కువగా ఉండటంతోనే కాదు, కొందరికి ఎక్కువైనా కూడా కండరాల బలహీనత దాడిచేయొచ్చు. అందువల్ల పొటాషియం మోతాదులను గమనిస్తుండటం ముఖ్యం. ఆండెర్‌సెన్‌ సిండ్రోమ్‌ గలవారికీ ఇది రావొచ్చు. ఇందులో గుండె లయ అస్తవ్యస్తమవుతుంది. థైరాయిడ్‌ హార్మోన్లు ఎక్కువున్నా పొటాషియం మోతాదులు పడిపోవచ్చు. కిడ్నీలో వడపోత ప్రక్రియ దెబ్బతినటం మూలంగానూ ఇది రావొచ్చు. కాబట్టి గుండె, థైరాయిడ్‌, కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. పొటాషియం మోతాదులు సరి చేయటానికి పొటాషియం మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది. తరచూ కండరాలు బలహీనపడుతుంటే ఎసిటజోలమైడ్‌ లేదా స్పైరనోల్యాక్టోన్‌ ఉపయోగపడతాయి. కొందరికి రెండూ అవసరపడొచ్చు. థైరాయిడ్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉంటే ప్రొప్రనోలాల్‌ వంటి బీటా బ్లాకర్లు మేలు చేస్తాయి. హైపోకాలమిక్‌ పీరియాడిక్‌ పెరాలసిస్‌ గలవారిలో సాధారణంగా ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఉన్నట్టుండి కండరాల బలహీనత దాడి చేస్తుంటుంది. కాబట్టి మీరు మరీ ఎక్కువగా వ్యాయామం చేయరాదు. పిండి పదార్థాలు మితంగా తినాలి. పొటాషియం తక్కువగా ఉన్నట్టయితే మందులతో పాటు కొబ్బరినీరు, అరటిపండ్ల వంటివి తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవటం మంచిది.

చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని