వ్యాయామంతో క్యాన్సర్‌ కట్టు

క్యాన్సర్‌ కేసులు, మరణాలు తగ్గటానికి క్రమం తప్పని వ్యాయామం ఎంతైనా అవసరమని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బలాన్ని పెంచే వ్యాయామాలతో (బస్కీలు, చేతుల మీద శరీర బరువు మోపటం, బరువులు ఎత్తటం వంటివి) క్యాన్సర్‌తో ...

Updated : 09 Nov 2021 01:00 IST

క్యాన్సర్‌ కేసులు, మరణాలు తగ్గటానికి క్రమం తప్పని వ్యాయామం ఎంతైనా అవసరమని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బలాన్ని పెంచే వ్యాయామాలతో (బస్కీలు, చేతుల మీద శరీర బరువు మోపటం, బరువులు ఎత్తటం వంటివి) క్యాన్సర్‌తో మరణించే ముప్పు 14% వరకు తగ్గుతున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలతో కిడ్నీ క్యాన్సర్‌ ముప్పు 26% వరకు తగ్గుతుండటం గమనార్హం. అయితే వీటికి ఏరోబిక్‌ వ్యాయామాలు (నడక, పరుగు, ఈత, సైకిల్‌ తొక్కటం వంటివి) కూడా తోడైతే క్యాన్సర్‌తో మరణించే ముప్పు 28% వరకు తగ్గుతున్నట్టు బయటపడింది. సుమారు 13 లక్షల మందిని 25 ఏళ్ల పాటు పరిశీలించిన 12 అధ్యయనాలను సమీక్షించి ఈ విషయాలను గుర్తించారు. క్యాన్సర్‌ బారినపడ్డవారిలో కణితుల వృద్ధిని నిలువరించటానికి వ్యాయామం తోడ్పడుతున్నట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది. వ్యాయామం చేసినప్పుడు కండరాల నుంచి మయోకైన్స్‌ అనే ప్రొటీన్లు విడుదలవుతాయి. ఇవి రక్తం ద్వారా కణితులకు చేరుకొని అవి వృద్ధి కాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ కణాలతో పోరాడటంలో శరీరానికి తోడ్పడతాయి. మూడు నెలల పాటు వ్యాయామం చేసినవారిలో మయోకైన్స్‌ మోతాదులు పెరుగుతున్నట్టు, అదే సమయంలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కణాల వృద్ధి గణనీయంగా తగ్గుముఖం పట్టినట్టు తేలటం విశేషం. నిజానికి మయోకైన్స్‌ నేరుగా క్యాన్సర్‌ కణాలను చంపవు. కానీ వీటిపై దాడి చేసి, చంపేలా రోగనిరోధక కణాలకు సంకేతాలు అందిస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని