నిద్ర బంగారమే

నిద్రలేమి వంటివి రోజురోజుకీ పెద్ద సమస్యగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో ఇవి మరింత సమస్యాత్మకంగానూ పరిణమిస్తున్నాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆలస్యంగా నిద్ర పట్టటం, త్వరగా మెలకువ రావటం..

Updated : 16 Nov 2021 01:24 IST

నిద్రలేమి వంటివి రోజురోజుకీ పెద్ద సమస్యగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో ఇవి మరింత సమస్యాత్మకంగానూ పరిణమిస్తున్నాయి. వయసు మీద పడుతున్నకొద్దీ ఆలస్యంగా నిద్ర పట్టటం, త్వరగా మెలకువ రావటం.. గాఢంగా నిద్ర పట్టకపోవటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిని వయసుతో పాటు వచ్చే మార్పులుగా కొట్టిపారేయకుండా కారణాల గురించి తెలుసుకొని, నిపుణుల సలహాతో చికిత్స తీసుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే నిద్రలేమి రకరకాల దుష్పరిణామాలకు దారితీస్తుంది. 50ల్లో, 60ల్లో ఆరు గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి మతిమరుపు ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. నిద్రలేమితో గ్రోత్‌ హార్మోన్‌ లోపిస్తుంది. ఒత్తిడికి సంకేతమైన కార్టిజోల్‌ హార్మోన్‌ పెరుగుతుంది. ఇవి రెండూ బరువు పెరగటానికి దోహదం చేసేవే. చాలీచాలని నిద్రతో జీవక్రియలూ గతి తప్పుతాయి. ఇది మధుమేహం ముప్పు పెరిగేలా చేస్తుంది. ఇన్సులిన్‌, గ్లూకోజు తగ్గించే మాత్రలు తీసుకునేవారిలోనూ నిద్రలేమితో అన్ని కారణాలతో మరణించే ముప్పు ఎక్కువవుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

కారణలేంటి?

నిద్ర సమస్యలు ఏ వయసులోనైనా దాడి చేయొచ్చు గానీ వృద్ధులకు ఇవి వచ్చే అవకాశం ఎక్కువ. ఇందుకు రకరకాల అంశాలు దారితీస్తుంటాయి.

గురక: పెద్దవారిలో సుమారు 45% మంది అప్పుడు గురక పెడుతుంటే.. 25% మంది తరచూ గురక పెడుతుంటారని అంచనా. దీని మూలంగా రాత్రంతా మధ్యమధ్యలో నిద్రలోంచి మెలకువ వచ్చేస్తుంటుంది.

నొప్పులు: పెద్ద వయసులో నొప్పులు ఎక్కువ. ఇవి నిద్ర సరిగా పట్టకుండా చేస్తాయి. నిద్రలేమితో నొప్పులు మరింత తీవ్రమవుతుంటాయి కూడా. ఇలా ఇదో విష వలయంలా తయారవుతుంది.

రాత్రిపూట మూత్రం: వృద్ధుల్లో చాలామంది.. దాదాపు 80% మంది రాత్రిపూట మూత్రం పోయటానికి లేస్తుంటారు. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. గాఢ నిద్ర పట్టటం తగ్గుతుంది.

పగటిపూట మత్తు: రాత్రిపూట నిద్ర సరిగా పోకపోవటం వల్ల పగటి పూట మత్తుగా ఉంటుంది. దీంతో కొందరు కునికి పాట్లు పడుతుంటారు. కొందరు మధ్యాహ్నం వేళల్లో ఎక్కువసేపు నిద్రపోతుంటారు కూడా. ఇది రాత్రి నిద్రను దెబ్బతీస్తుంది. పగటి మత్తు గుండెజబ్బులు, విషయగ్రహణ లోపం, నిద్రలో కాసేపు శ్వాస ఆడకపోవటం వంటి సమస్యలకూ సంకేతమే.

కాళ్లలో చిరచిర: కొందరు చిరచిరగా అనిపించటం వల్ల కాళ్లను అదేపనిగా ఊపుతుంటారు (రెస్ట్‌లెస్‌ లెగ్‌ సిండ్రోమ్‌). ఇది సాయంత్రం, రాత్రివేళల్లో కూర్చున్నప్పుడో, పడుకున్నప్పుడో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది అప్పటికి హాయిగా అనిపించినా నిద్రను దెబ్బతీసే ప్రమాదముంది.

మందులు: వృద్ధులు రకరకాల జబ్బులకు మందులు వేసుకుంటుంటారు. ఇవీ నిద్ర సమస్యలకు దారితీయొచ్చు. యాంటిహిస్టమిన్లు, నిద్రమాత్రలు పగటిపూట మత్తుగా ఉండేలా చేయొచ్చు. కుంగుబాటు మందులు, కార్టికోస్టిరాయిడ్లు కొందరికి నిద్రలేమికి కారణం కావొచ్చు.

శారీరక శ్రమ లేకపోవటం: నిద్ర సరిగా పట్టకపోవటానికి జీవనశైలీ కారణమే. మామూలుగానే వృద్ధులు అంతగా పనులు చేయరు. కునుకూ తీస్తుంటారు. ఇవి నిద్ర తీరుతెన్నులు అస్తవ్యస్తమయ్యేలా చేయొచ్చు. ఇతరుల మీద ఆధారపడటం, ఒంటరితనం వంటివి ఒత్తిడి, ఆందోళనకు దారితీయొచ్చు. ఇవీ నిద్రకు భంగం కలిగిస్తాయి.

చికిత్సలు

వయసు పెరుగుతున్న కొద్దీ జీవక్రియలు మందగిస్తుంటాయి. కండరాల మోతాదు తగ్గుతుంది. కొవ్వు శాతం పెరుగుతుంది. వృద్ధాప్యంలో ఒంట్లో నీటి పరిమాణం, రక్తంలో ప్రొటీన్లు కూడా తగ్గుముఖం పడతాయి. దీంతో మందులు పూర్తి స్థాయిలో పనిచేయవు. దుష్ప్రభావాల ముప్పూ ఎక్కువే. అందువల్ల వృద్ధుల్లో నిద్ర సమస్యలకు మందుల కన్నా ముందుగా ఇతరత్రా పద్ధతులను పాటించటమే మంచిది. రోజూ ఒకే వేళకు పడుకోవటం, లేవటం.. ధ్యానం, ప్రాణాయామం, పగటి పూట ఎక్కువసేపు నిద్ర పోకపోవటం..  సాయంత్రం వేళ కాఫీ, కెఫీన్‌తో కూడిన కూడిన పానీయాలు తాగకపోవటం.. మద్యం అలవాటుంటే పరిమితం చేసుకోవటం, బరువు తగ్గించుకోవటం, పొగ మానెయ్యటం, నడక వంటి వ్యాయామాలు, మధుమేహం వంటి ఇతరత్రా జబ్బులను అదుపులో ఉంచుకోవటం వంటివి మేలు చేస్తాయి. ప్రవర్తన, ఆలోచనా ధోరణి మార్చే చికిత్స కూడా ఉపయోగపడుతుంది. గురక బాగా ఎక్కువగా ఉంటే సీప్యాప్‌ వంటి పరికరాలు వాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు