మెదడుకు ఉప్పు చేటు

ఉప్పు వంటలకు రుచిని తెచ్చిపెడుతుండొచ్చు గానీ మితిమీరితే ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తుంది. ఇది తెలివి తేటలను, జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీయగలదు. మెదడులో రక్త ప్రసరణ,

Published : 16 Nov 2021 01:34 IST

ప్పు వంటలకు రుచిని తెచ్చిపెడుతుండొచ్చు గానీ మితిమీరితే ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తుంది. ఇది తెలివి తేటలను, జ్ఞాపకశక్తిని కూడా దెబ్బతీయగలదు. మెదడులో రక్త ప్రసరణ, నాడీకణాల పనితీరుపై ఉప్పు విపరీత ప్రభావితం చూపుతున్నట్టు.. ఇది విషయ గ్రహణ సామర్థ్యం తగ్గటానికి దారితీసే అవకాశమున్నట్టు తాజా అధ్యయనం ఒకటి సూచిస్తోంది మరి. రక్త ప్రసరణ పెరగటం వల్ల నాడీ కణాలు ప్రేరేపితమవుతున్నట్టు ఇంతకుముందే వెల్లడైనా.. ఇదెలా జరుగుతుందన్నది తెలియదు. దీన్ని గుర్తించటానికే జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల అత్యాధునిక ఇమేజింగ్‌, శస్త్రచికిత్స పద్ధతుల సాయంతో మెదడులోని హైపోథలమస్‌ మీద అధ్యయనం నిర్వహించారు. తినటం, తాగటం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, పునరుత్పత్తి వంటి పనుల్లో హైపోథలమస్‌ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో సోడియం మోతాదులు కచ్చితంగా నియంత్రణలో ఉండటానికి ఉప్పు అవసరం. అందుకే పరిశోధకులు దీన్ని ఎంచుకొని పరిశీలించారు. మనం ఉప్పు పదార్థాలు తిన్నప్పుడు సోడియం మోతాదులను తగ్గించటానికి రకరకాల యంత్రాంగాలు రంగంలోకి దిగుతాయి. శరీరం నాడులను ప్రేరేపించి వాసోప్రెసిన్‌ను విడుదలయ్యేలా చేస్తుంది. ఇది ఉప్పు స్థాయులు నియంత్రణలో ఉండటంలో పాలు పంచుకుంటుంది. కానీ హైపోథలమస్‌లో నాడులు ప్రేరేపితమైనప్పుడు రక్త ప్రవాహం పెరగటానికి బదులు రక్తనాళాలు కుంచించుకుపోతుండటం గమనార్హం. ఫలితంగా మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అల్జీమర్స్‌, పక్షవాతం వంటి జబ్బుల బారినపడ్డవారిలో మెదడులోని కార్టెక్స్‌లో రక్త ప్రసరణ తగ్గుతుందనే విషయాన్ని మరవరాదని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. ఉప్పు పదార్థాలు ఎక్కువగా తింటే ఒంట్లో సోడియం మోతాదులు చాలాసేపటి వరకు ఎక్కువగానే ఉంటాయని వివరిస్తున్నారు. మెదడుకు రక్త ప్రసరణ తగ్గటం వల్ల నాడీ కణాలు కూడా ఎక్కువసేపు ఉత్తేజిత స్థితిలో ఉంటాయని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా అధిక రక్తపోటు మెదడును ఎలా దెబ్బతీయగలదో అధ్యయనం వివరించి చెబుతోంది. అధిక రక్తపోటు గలవారిలో 50-60% మంది ఉప్పు ఎక్కువగా తినేవారే. ఇలా ఎక్కువెక్కువగా ఉప్పు తినటం వల్ల వాసోప్రెసిన్‌ను విడుదల చేసే నాడీకణాలు అతిగా ప్రేరేపితమవుతాయి. దీంతో మెదడుకు రక్త ప్రసరణ తగ్గి, కణజాలం దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని