ముక్కు దురద ఎందుకని?

నాకు గత ఆర్నెల్లుగా రోజంతా రెండు ముక్కులు దురద పెడుతున్నాయి. అలాగే ఏదైనా తింటున్నప్పుడు ముక్కులోంచి నీరులాంటి ద్రవం కారుతోంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

Updated : 23 Nov 2021 06:51 IST

సమస్య: నాకు గత ఆర్నెల్లుగా రోజంతా రెండు ముక్కులు దురద పెడుతున్నాయి. అలాగే ఏదైనా తింటున్నప్పుడు ముక్కులోంచి నీరులాంటి ద్రవం కారుతోంది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

- ఆర్‌.గోపాల రావు, విజయవాడ

సలహా: లక్షణాలను బట్టి మీరు ముక్కు అలర్జీతో (అలర్జిక్‌ రైనైటిస్‌) బాధపడుతున్నారని అనిపిస్తోంది. ఇది తరచూ చూసే సమస్యే. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావొచ్చు. కొందరికి కొన్ని కాలాల్లోనే కనిపిస్తే.. కొందరికి ఏడాదంతా ఉండొచ్చు. దీనికి దుమ్ము, పుప్పొడి, వాహనాల పొగ, చల్లటి వాతావరణం, పెంపుడు జంతువుల నూగు, సౌందర్య సాధనాలు, తలకు వేసుకునే రంగుల వంటివేవైనా కారణం కావొచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైంది ఇంట్లోని దుమ్ము. దుప్పట్లలోని తవిటి పురుగులు (డస్ట్‌ మైట్స్‌) కూడా కారణం కావొచ్చు. మీరు గత ఆర్నెల్లుగా ముక్కు దురదతో బాధపడుతున్నారని అంటున్నారు. అందువల్ల ఇటీవల నివాసం, ఆఫీసు వంటివి మార్చారేమో కూడా ఆలోచించాల్సిన విషయమే. కొత్తగా ఏవైనా అలర్జీ కారకాలకు గురికావటమూ మీ సమస్యకు కారణం కావొచ్చు. ఇలాంటి అలర్జీ కారకాలు ముక్కులోకి వెళ్లి, జిగురుపొరకు తాకినప్పుడు హిస్టమైన్‌ విడుదలవుతుంది. దీంతో దురద, తుమ్ముల వంటి లక్షణాలు మొదలవుతాయి. కొందరికి.. ముఖ్యంగా వృద్ధుల్లో ముక్కు నుంచి నీరు కారొచ్చు (సెనైల్‌ రైనోరియా). కారం వస్తువులు తింటున్నప్పుడు ఇది ఎక్కువగా చూస్తుంటాం. వేటికి గురైనప్పుడు అలర్జీ లక్షణాలు తలెత్తుతున్నాయనే దాన్ని బట్టి సమస్యను నిర్ధరిస్తారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఎవరికి వారే వీటిని గుర్తించొచ్చు. స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌, కొన్ని రక్త పరీక్షలతోనూ వీటిని తెలుసుకోవచ్చు. కొందరికి నేసల్‌ ఎండోస్కోపీ కూడా అవసరమవ్వచ్చు. అలర్జీ ఉన్నట్టయితే ఇందులో జిగురుపొర పాలిపోయి, ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. దీనికి ప్రధాన చికిత్స- అలర్జీ కారకాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం. బయటకు వెళ్లినప్పుడు మాస్కు పెట్టుకోవాలి. ద్విచక్ర వాహనం మీద వెళ్తే హెల్మెట్‌ ధరించాలి. ఇంట్లో దుమ్ము పడకపోతే ఊడ్చటం, దులపటం వంటి పనులు చేయొద్దు. దుప్పట్లు వారానికోసారి మార్చాలి. మంచం, పరుపును వ్యాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి. పడకగదిలో తివాచీలు, మెత్తటి ఆట వస్తువులు లేకుండా చూసుకోవాలి. వీటితో ఫలితం లేకపోతే యాంటీ హిస్టమిన్‌ మాత్రలు (సిట్రిజిన్‌, లివో సిట్రిజిన్‌, ఫెక్సోఫెనెడిన్‌, డెస్లరాటిడిన్‌ వంటివి) రోజుకు ఒకటి వేసుకోవచ్చు. ఫ్లుటికసోన్‌, మొమెటసోన్‌, బూడిసనైడ్‌ వంటి కార్టికో స్టిరాయిడ్‌ స్ప్రేలను ముక్కులోకి కొట్టుకోవటమూ మేలు చేస్తుంది. వీటిని రెండు స్ప్రేల చొప్పున రోజుకు ఒకసారి కొట్టుకోవాలి. దీంతో 24 గంటల వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఈ స్ప్రేలతోనే మంచి ఫలితం కనిపించొచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రంగా ఉండి.. శ్వాస సరిగా ఆడక, నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నట్టయితే ముక్కు దూలం ఒకపక్కకు ఒరిగిపోయిందా? ముక్కులోని టర్బినేట్లు ఉబ్బాయా? అనేవి చూడాల్సి ఉంటుంది. నేసల్‌ ఎండోస్కోపీ, సీటీస్కాన్‌ ద్వారా వీటిని గుర్తించొచ్చు. లక్షణాలు బాగా ఇబ్బంది పెడుతుంటే శస్త్రచికిత్సతో ముక్కు దూలాన్ని సరిచేయాల్సి ఉంటుంది. టర్బినేట్ల సైజు తగ్గించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని