ఆమెకు బరువు భారం

పట్టణాలు, పల్లెలనే తేడా లేదు. ఊబకాయం సర్వత్రా విస్తరిస్తోంది. మహిళల్లో మరింత అధికంగా విజృంభిస్తోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య గణన (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) చెబుతున్న సత్యమిది.

Updated : 30 Nov 2021 05:51 IST

పట్టణాలు, పల్లెలనే తేడా లేదు. ఊబకాయం సర్వత్రా విస్తరిస్తోంది. మహిళల్లో మరింత అధికంగా విజృంభిస్తోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య గణన (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) చెబుతున్న సత్యమిది. రక్తహీనతతో పాటు ఊబకాయమూ పెరుగుతుండటం విచిత్రం. ఊబకాయంతో సాంక్రమికేతర జబ్బులు దాడి చేసే అవకాశముంది కాబట్టి ఇప్పటికైనా కళ్లు తెరవటం మంచిది. లేకపోతే మున్ముందు భారతావని జబ్బుల కుప్పగా మారుతుందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇంటికి దీపం ఇల్లాలని అంటారు. ఆరోగ్యానికి కూడా. ఆమె బాగుంటేనే ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ మనం ఎక్కడో గాడి తప్పుతున్నాం. రోజురోజుకీ మహిళల్లో ఊబకాయం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. ఇది పట్టణాలకే పరిమితం కావటం లేదు. ఇప్పుడు గ్రామాల్లోనూ అధిక బరువు, ఊబకాయం పెద్ద సమస్యలుగా పరిణమిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య గణన ప్రకారం మగవారిలో, ఆడవారిలో ఊబకాయం పెరిగినప్పటికీ మహిళల్లో ఇంకాస్త ఎక్కువగానూ ఉంటోంది. వీరిలో ఊబకాయం 20.6 శాతం నుంచి 24 శాతానికి ఎగబాకింది. పట్టణ మహిళల్లో 33.2% మందిలో శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) 25 కన్నా మించిపోవటం గమనార్హం. గ్రామాల్లోనూ 19.7% మందిలో బీఎంఐ ఎక్కువగానే ఉన్నట్టు బయటపడింది.

మారుతున్న అలవాట్లతోనే..

శరీర అవసరాలకు మించి ఆహారం తినటం. తిన్న ఆహారం ఖర్చయ్యేంత శారీరక శ్రమ చేయకపోటం. ఊబకాయానికి ప్రధాన కారణాలు ఇవే. మనం తిన్న ఆహారం ఎప్పటికప్పుడు ఖర్చు కావాలి. లేకపోతే మిగిలినదంతా కొవ్వుగా మారుతుంది. క్రమంగా ఇది పొట్టలో అవయవాల చుట్టూ పేరుకుపోతుంటుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. ఇప్పుడు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఆహార అలవాట్లు, జీవనశైలి గణనీయంగా మారిపోయాయి. శారీరక శ్రమ తగ్గిపోయింది. గ్రామాల్లో ఒకప్పుడు ఉదయం సద్దన్నం తిని పొలాలకు వెళ్లేవారు. మధ్యాహ్నం వెంట తెచ్చుకున్న ఆహారం తినేవారు. సాయంత్రం ఇంటికి వచ్చాకా పనులు చేసేవారు. వండుకొని, తినేవారు. ఇలా రోజంతా శరీరం అలసిపోవటం వల్ల కంటి నిండా నిద్రించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పట్టణాల్లోనైతే బయటి తిండి తినటమూ పెరిగింది. ఉద్యోగులే కాదు, ఇంట్లో ఉండేవాళ్లూ బయటి తిండిపై మోజు పెంచుకుంటున్నారు. ఆఫీసుల్లోనైతే ఎంతసేపూ కూర్చోవటమే. ఇటీవల ఇంటి నుంచి పనిచేస్తున్నా పరిస్థితి మారటం లేదు. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది కూడా. దీంతో 24 గంటలూ కూర్చొనే ఉంటున్నారు. ఇక కేలరీలు ఎలా ఖర్చవుతాయి? పైగా రాత్రిపూట త్వరగా పడుకోవటం నామోషీగా మారింది. అర్ధరాత్రి వరకూ టీవీలు, ఫోన్‌లు చూసుకుంటూ గడిపేయటం ఎక్కువైంది. దీంతో మర్నాడు పొద్దుపోయాక లేవటం, గబగబా సిద్ధమై ఉద్యోగాలకు పరుగెత్తటం. ఇదీ పరిస్థితి. మనకు రాత్రిపూట 8 గంటల నిద్ర అవసరం. నిద్రపోయినప్పుడే శరీరం మరమ్మతు అవుతుంది. జీవక్రియలు సజావుగా సాగుతాయి. ఇవి అస్తవ్యస్తమైతే బరువూ పెరుగుతుంది.

మానసిక ఒత్తిడి సైతం బరువు పెరిగేలా చేస్తుంది. ఒత్తిడి మూలంగా విడుదలయ్యే కార్టిజోల్‌ హార్మోన్‌ గ్లూకోజు పెరిగేలా చేస్తుంది. జీవక్రియలనూ దెబ్బతీస్తుంది. కుంగుబాటుకూ దారితీస్తుంది. కుంగుబాటుతో మరో సమస్య ఎక్కువెక్కువగా తినటం. హుషారు తగ్గటం వల్ల ఎప్పుడూ కూర్చొనే ఉంటారు. ఇవన్నీ బరువు పెరిగేలా చేసేవే.

జబ్బుల ఊబి

ఊబకాయంతో ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తుతుంది. అంటే కణాలు ఇన్సులిన్‌కు స్పందించవన్నమాట. దీంతో కణాల్లోకి గ్లూకోజు వెళ్లదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజు పెరుగుతుంది. అధిక గ్లూకోజు కణాల శక్తి కేంద్రకాన్నీ (మైటోకాండ్రియా) దెబ్బతీస్తుంది. ఫలితంగా కణాలు నిర్వీర్యమవుతాయి. గ్లూకోజు పెరిగినప్పుడు క్లోమగ్రంథి మరింత ఎక్కువగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. క్రమంగా క్లోమం పనితీరూ మందగిస్తుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది. చివరికి ప్రొటీన్లకు, కొవ్వులకు గ్లూకోజు అంటుకుపోతుంది (అడ్వాన్స్‌డ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ ప్రొడక్ట్స్‌) కూడా. దీంతో రక్తనాళాల మృదుత్వం దెబ్బతిని, సాగే గుణం తగ్గుతుంది. ఇది అధిక రక్తపోటు, గుండెజబ్బు, కిడ్నీజబ్బులకు దారితీస్తుంది. ఊబకాయంతో అండాశయాల్లో నీటితిత్తులు ఏర్పడొచ్చు (పీసీఓఎస్‌). ఇది సంతానం కలగటంలో ఇబ్బందులు సృష్టిస్తుంది.

ముందే మేల్కోవాలి

ఒకసారి బరువు పెరిగాక తగ్గటం అంత తేలిక కాదు. అందువల్ల ముందు నుంచే జాగ్రత్త పడాలి. అలాగని అధిక బరువును అసలే తగ్గించుకోలేమని కాదు. ఆహార, వ్యాయామాలతో దీన్ని అదుపులో ఉంచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు.

సమతులాహారం: బరువు తగ్గటంలో 75% పాత్ర దీనిదే. అనవసరంగా, అతిగా తినకపోవటం అన్నింటికన్నా ముఖ్యం. ఆహారంలో అన్ని పోషకాలు, పదార్థాలు సమతులంగా ఉండేలా చూసుకోవాలి. అన్నం వడ్డించుకునే పళ్లెం చిన్నగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని నాలుగు భాగాలుగా ఊహించుకొని.. ఒక భాగం అన్నం లేదా 2 పుల్కాలు, రెండు భాగాలు కూరగాయలు, ఒక భాగం పప్పులు, పెరుగు వంటివి వడ్డించుకోవాలి. కావాలంటే అన్నం బదులు సజ్జలు, కొర్రల వంటి చిరుధాన్యాలు తీసుకోవచ్చు. వీటిని ఎక్కువగా తినలేం. కాబట్టి ఆహార పరిమాణమూ తగ్గుతుంది. పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తినాలి. తీపి పదార్థాలు తగ్గించాలి. పీచు పెంచుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్‌ ఫుడ్‌ అసలే తినకూడదు. ఒకసారి వాడిన నూనెలను మళ్లీ వాడటం ప్రమాదరకం. చిప్స్‌, వేపుళ్ల వంటి వాటిల్లోని సంతృప్త కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్స్‌ హాని చేస్తాయని తెలుసుకోవాలి. కూల్‌డ్రింకుల జోలికి అసలే వెళ్లకూడదు. ఇప్పుడు మహిళల్లోనూ మద్యం వాడకం పెరిగిపోయింది. దీని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వ్యాయామం: వ్యాయామం అనగానే ‘ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను’ అని చాలామంది చెబుతుంటారు. ఇంటి పనితో శారీరక శ్రమ లభించినా దాన్ని వ్యాయామంగా పరిగణించటం తగదు. ప్రత్యేకించి వ్యాయామం చేయటం ముఖ్యం. కనీసం రోజుకు అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. శక్తిని ఖర్చు చేసే ఏరోబిక్‌ వ్యాయామాలు.. నడక, పరుగు, తాడాట, ఈత, సైకిల్‌ తొక్కటం వంటివేవైనా సరే. తోట పని కూడా ఎంతో మేలు చేస్తుంది. యోగా సైతం మంచిదే. దీంతో కండరాలు బలోపేతమవుతాయి. శరీరం మృదువుగా కదులుతుంది.

ధ్యానం, ప్రాణాయామం: ఒత్తిడి తగ్గటానికివి ఎంతో మేలు చేస్తాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇవీ పరోక్షంగా బరువు తగ్గటానికి బాగా తోడ్పడతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని