కళ్ల కింద లోతు పోయేదెలా?

నా వయసు 21. నా కళ్ల కింద లోతుగా (సంకెన్‌ ఐస్‌) ఉంటుంది. అక్కడంతా నల్లగా కనిపిస్తుంది. ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు మరింత ఎక్కువవుతుంది. ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. నిద్ర బాగానే పోతాను. నీళ్లు బాగానే తాగుతాను. అయినా ఈ

Updated : 30 Nov 2021 05:34 IST

సమస్య: నా వయసు 21. నా కళ్ల కింద లోతుగా (సంకెన్‌ ఐస్‌) ఉంటుంది. అక్కడంతా నల్లగా కనిపిస్తుంది. ఫోన్‌ మాట్లాడుతున్నప్పుడు మరింత ఎక్కువవుతుంది. ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. నిద్ర బాగానే పోతాను. నీళ్లు బాగానే తాగుతాను. అయినా ఈ సమస్య ఎందుకు వచ్చింది? పరిష్కారమేంటి?

- వరలక్ష్మి (ఈమెయిల్‌)


సలహా: ఇంత చిన్న వయసులో సంకెన్‌ ఐస్‌ రావటం అరుదు. ఇది వయసు మీద పడుతున్నకొద్దీ.. 40, 50 ఏళ్లలో వచ్చే సమస్య. నీటి శాతం తగ్గటం, నిద్ర పట్టకపోవటంతోనూ ఇది రావొచ్చు. మీరు నీరు బాగుతున్నానని, నిద్ర బాగా పోతున్నానని అంటున్నారు. అయినా వచ్చిందంటే జన్యు స్వభావం కారణం కావొచ్చు. ఫోన్‌కూ దీనికి సంబంధం లేదు. బుగ్గ, కింది రెప్ప కలిసే చోట చర్మం అడుగున కొవ్వు తగ్గటం, జారటం వల్ల కళ్ల కింద లోతు ఏర్పడుతుంది. దీంతో కళ్లు లోతుకు పోయినట్టు కనిపిస్తాయి. గుంతలో నీడ పడటం వల్ల నల్లగానూ కనిపిస్తుంది. కొందరికి కంటి చుట్టూరా ఉండే కొవ్వు తగ్గటంతోనూ నిజంగా కళ్లు లోతుకు పోవచ్చు. ఇది చాలా చాలా అరుదు. అందువల్ల కారణాన్ని గుర్తించటం ముఖ్యం. కళ్ల కింద లోతును చూడగానే గుర్తించొచ్చు. పరీక్షలేమీ అవసరం లేదు. దీనికి కొవ్వు మార్పిడి (ఫ్యాట్‌ గ్రాఫ్టింగ్‌) చికిత్స బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ముందుగా పొట్ట లేదా నడుం పక్క భాగాల నుంచి కొవ్వును తీసి, అందులోంచి సన్నటి కొవ్వు కణాలను వేరు చేస్తారు. దీన్ని సూది ద్వారా పొరలు పొరలుగా, సమాంతరంగా పరచుకుంటూ రెప్ప కింద చర్మం లోపలికి ఎక్కిస్తారు. ఇందులో కొంత కరిగిపోవచ్చు కాబట్టి మరోసారీ కొవ్వు ఎక్కించాల్సి ఉంటుంది. అవసరమైతే మూడోసారీ ఇస్తారు. ఈ కొవ్వుకు రక్త సరఫరా జరగటం వల్ల అది అక్కడే ఉండిపోతుంది. సమస్య నయమవుతుంది. కొన్నిసార్లు ఎండ తగలటం, అలర్జీలు, సైనసైటిస్‌ వంటివీ కళ్ల కింద లోతుకు కారణం కావొచ్చు. మీరు దగ్గర్లోని కాస్మెటిక్‌ లేదా చర్మ నిపుణులను సంప్రదించండి. లోతును పరిశీలించి, అవసరమైన చికిత్స సూచిస్తారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని