పీచు మేలు

పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శాకాహారంతోనే లభిస్తుంది. ఇందులో రకరకాలు ఉండొచ్చు గానీ ప్రధానమైనవి నీటిలో కరిగేది, నీటిలో కరగనిది. నీటిలో కరిగే పీచు మృదువుగా ఉంటుంది. ఇది కూరగాయలు, విత్తనాలు, దంపుడు

Updated : 30 Nov 2021 05:37 IST

పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కేవలం శాకాహారంతోనే లభిస్తుంది. ఇందులో రకరకాలు ఉండొచ్చు గానీ ప్రధానమైనవి నీటిలో కరిగేది, నీటిలో కరగనిది. నీటిలో కరిగే పీచు మృదువుగా ఉంటుంది. ఇది కూరగాయలు, విత్తనాలు, దంపుడు బియ్యం, బార్లీ, ఓట్స్‌ వంటి వాటితో లభిస్తుంది. నీటిని పీల్చుకోవటం ద్వారా ఇది మల పదార్థం ఏర్పడేలా, విసర్జన సాఫీగా సాగేలా చేస్తుంది. ఒకరకంగా దీన్ని స్పాంజిలాంటిదని అనుకోవచ్చు. ఇది తన బరువు కన్నా ఎన్నో రెట్లు నీటిని పీల్చుకొని, పేగుల్లో ఉబ్బుతుంది. నీటిలో కరగని పీచు కాస్త గట్టిగా ఉంటుంది. ఇది విత్తనాలు, పండ్లు, పప్పుధాన్యాలతో లభిస్తుంది. కాలేయం నుంచి పేగుల్లోకి వచ్చే కొలెస్ట్రాల్‌ను ఇది పట్టేసుకుంటుంది. మలబద్ధకం, మొలలు, బుడిపెలు, క్యాన్సర్‌ వంటి పెద్దపేగు సమస్యల నివారణకు పీచు బాగా తోడ్పడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ కలవకుండా అడ్డుకోవటమే కాదు.. దీన్ని ఒంట్లోంచి బయటకు వెళ్లగొడుతుంది కూడా. రోజుకు ఒక కప్పు ఓట్‌ బ్రాన్‌ తీసుకున్నా 30% వరకు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునే అవకాశముంది. ఇది జిగురుద్రవంలా మారి జీర్ణాశయంలో ఎక్కువసేపు ఆహారం అక్కడే ఉండేలా చేస్తుంది. కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆహారం త్వరగా జీర్ణం కాకుండా చూస్తూ రక్తంలోకి గ్లూకోజు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. పీచు అవసరం జీర్ణ వ్యవస్థ పరిమాణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పెద్దగా ఉంటే ఎక్కువ పీచు కావాలి. ఉదాహరణకు- 50 కిలోల బరువు గలవారికి రోజుకు 20-25 గ్రాములు అవసరం. అదే 75 కిలోల బరువుంటే సుమారు 30-35 గ్రాములు కావాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని