పక్షవాతంతో చూపు దెబ్బతిన్నా..

పక్షవాతం బారినపడ్డవారిలో కొందరికి చూపు దెబ్బతినొచ్చు. దీన్నే హిమియానోపియా అంటారు. ఇది ఒక కంటి చూపును దెబ్బతీస్తుంది. దీనికి మూలం మెదడులో చూపు మార్గాలు దెబ్బతినటం. ఇలాంటివారిలో ఎంతవరకు చూపు పోయింది? ఎంతమేరకు దృశ్యాలు కనిపిస్తున్నాయి?

Published : 11 Jan 2022 01:01 IST

క్షవాతం బారినపడ్డవారిలో కొందరికి చూపు దెబ్బతినొచ్చు. దీన్నే హిమియానోపియా అంటారు. ఇది ఒక కంటి చూపును దెబ్బతీస్తుంది. దీనికి మూలం మెదడులో చూపు మార్గాలు దెబ్బతినటం. ఇలాంటివారిలో ఎంతవరకు చూపు పోయింది? ఎంతమేరకు దృశ్యాలు కనిపిస్తున్నాయి? అనేది గుర్తించటానికి పెరిమెట్రీ పరీక్ష చేస్తుంటారు. అయితే దీంతో చూచాయగానే మిగిలి ఉన్న చూపు పరిధిని గుర్తించే అవకాశముంది. తిరిగి చూపు రప్పించటానికి సమర్థ చికిత్సలను రూపొందించటానికిది అడ్డంకిగా నిలుస్తోంది. ఇలాంటి ఇబ్బందిని తప్పించటానికి యూనివర్సిటీ ఆఫ్‌ నాటింగ్‌హామ్‌ శాస్త్రవేత్తలు కొత్త పద్ధతిని గుర్తించారు. పెరిమెట్రీ పరీక్ష, మెదడు స్కానింగ్‌ ఫలితాలను జతకలిపి మిగిలిన చూపు పరిధిని గణించటం ఇందులోని కీలకాంశం. పక్షవాతం బాధితుల్లో కన్ను దెబ్బతినటం వల్ల చూపు పోతుందని చాలామంది భావిస్తుంటారు. నిజానికి వీరిలో కళ్లు బాగానే ఉంటాయి కానీ కంటి నుంచే అందే సమాచారాన్ని మెదడు విశ్లేషించుకోలేదు. దీంతో చదవటం, వాహనాలు నడపటం, గుంపులో నడవటం వంటి పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. వృద్ధులకు కింద పడిపోయే ముప్పూ పెరుగుతుంది. పలు వైపుల నుంచి తీసిన స్కాన్‌ దృశ్యాల ఆధారంగా మెదడులో సమస్యకు కారణమవుతున్న భాగాన్ని కచ్చితంగా గుర్తించొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. పక్షవాతంతో చూపు దెబ్బతిన్నా మెదడు, కళ్లు ఇంకా దృశ్యాలను విడమరచుకోవటానికి తోడ్పడే భాగాలను గుర్తించటానికిది వీలు కల్పిస్తుంది. దీంతో పక్షవాతంతో చూపు దెబ్బతిన్నవారికి శిక్షణ ఇచ్చి ఆయా భాగాలను తిరిగి కొంతవరకు కోలుకునేలా చేయొచ్చు. మెదడులో వివిధ భాగాలు దెబ్బతినటం మూలంగానూ చూపు పరిధి తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందరికీ ఒకేలా కాకుండా ఆయా వ్యక్తులకు అనుగుణంగా చికిత్సలను రూపొందించాల్సిన అవసరముందని ఇది సూచిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని