తామర తగ్గదేం?

తామర (రింగ్‌వామ్‌) మొండి సమస్య. దీనికి మూలం ఫంగస్‌. సాధారణంగా తామర గజ్జల్లో తొడల మీద వస్తుంటుంది. ఇది రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి, చూడటానికి తామరాకు మాదిరిగా కనిపిస్తుంటుంది. అందుకే తామర అంటుంటారు. ఇది ఒక్క తొడల్లోనే కాదు,

Updated : 11 Jan 2022 06:22 IST

సమస్య: నాకు 27 ఏళ్లు. ఏడాది నుంచి తామరతో బాధపడుతున్నాను. మందులు వాడితే తగ్గుతుంది. ఆపేస్తే మళ్లీ వస్తుంది. స్వీటు, కారప్పూస లాంటివి ఏవి తిన్నా తామర తిరిగి వేధిస్తుంటుంది. దీనికి పరిష్కారమేంటి?

- జి.నరేంద్ర (ఈ-మెయిల్‌)

సలహా: తామర (రింగ్‌వామ్‌) మొండి సమస్య. దీనికి మూలం ఫంగస్‌. సాధారణంగా తామర గజ్జల్లో తొడల మీద వస్తుంటుంది. ఇది రెండు వైపులా అర్ధచంద్రాకారంలో విస్తరించి, చూడటానికి తామరాకు మాదిరిగా కనిపిస్తుంటుంది. అందుకే తామర అంటుంటారు. ఇది ఒక్క తొడల్లోనే కాదు, ఒంట్లో ఎక్కడైనా రావొచ్చు. ఫంగస్‌ బీజకణాలు చర్మం పొలుసుల్లో చాలాకాలం వరకు జీవించి ఉంటాయి. అందుకే సమస్య ఒక పట్టాన తగ్గకుండా వేధిస్తుంటుంది. తగ్గినట్టే తగ్గి తిరిగి విజృంభిస్తుంటుంది. కాబట్టి సమస్యను కచ్చితంగా నిర్ధరించి, సరైన చికిత్స తీసుకోవటం ముఖ్యం. చాలామంది బిడియంతోనో, మరే కారణంతోనో డాక్టర్‌ దగ్గరికి వెళ్లకుండా సొంతంగా దుకాణాల్లో పూత మందులు కొనుక్కొని వాడుతుంటారు. వీటిల్లో స్టిరాయిడ్‌ కలిసి ఉంటుంది. ఇది తాత్కాలికంగా లక్షణాలను తగ్గిస్తుంది గానీ లోపలి ఫంగస్‌ను నిర్మూలించలేదు. సమస్య అప్పటికి తగ్గినట్టు అనిపించినా లోపల ఇన్‌ఫెక్షన్‌ అలాగే ఉంటుంది. మీరు డాక్టర్‌ను సంప్రదించి, మందులు వాడుతున్నారో లేదో తెలియదు. తామరకు పూత మందులు, మాత్రలు అందుబాటులో ఉన్నాయి. వీటిని కనీసం 2-3 నెలలు వాడాల్సి ఉంటుంది. చర్మం లోపలి పొరల్లో ఫంగస్‌ బీజ కణాలు పూర్తిగా నిర్మూలన అయ్యేంతవరకు, డాక్టర్‌ చెప్పినంతవరకు మందులు తప్పకుండా వాడుకోవాలి. మీకు గజ్జల్లో తామర ఉన్నట్టయితే వదులైన లోదుస్తులు ధరించాలి. రోజూ దుస్తులను ఉతికిన తర్వాత గంటసేపు గోరువెచ్చటి నీటిలో నానబెట్టాలి. ఒకరి దుస్తులు మరొకరు వాడకూడదు. మీరు అనుకుంటున్నట్టు తామరకు ఆహారానికి సంబంధం లేదు. స్వీటు, కారప్పూస వంటివి తింటే తిరిగి వస్తుందని అనుకోవటం అపోహే. ఫంగస్‌ లోపల అలాగే ఉంటే తామర మళ్లీ మళ్లీ తిరగబెడుతుంది. చర్మ నిపుణుడిని సంప్రదించి, తగు మందులు వాడుకోవటం ఒక్కటే దీనికి పరిష్కార మార్గమని తెలుసుకోవాలి.


చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు కార్యాలయం, 
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 
email: sukhi@eenadu.in

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని