పూడికలకు కొత్తరకం చికిత్స!

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. దీన్ని రక్తనాళాల్లో పూడికల చికిత్సకూ వాడుకోవచ్చా? తాజా అధ్యయనాలు ఇలాంటి సంకేతాలే ఇస్తున్నాయి. గుండెపోటు, పక్షవాతానికి మూలం గుండె, మెదడుకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో పూడికలు

Published : 18 Jan 2022 00:26 IST

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. దీన్ని రక్తనాళాల్లో పూడికల చికిత్సకూ వాడుకోవచ్చా? తాజా అధ్యయనాలు ఇలాంటి సంకేతాలే ఇస్తున్నాయి. గుండెపోటు, పక్షవాతానికి మూలం గుండె, మెదడుకు రక్తాన్ని చేరవేసే నాళాల్లో పూడికలు ఏర్పడటం. వీటికి రక్తనాళాల్లో తలెత్తే వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) బీజం వేస్తుంది. ప్రస్తుతం పూడికల చికిత్సలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులు వాడుతున్నారు. రక్తనాళం మూసుకుపోతే స్టెంట్‌ అమర్చటమో, ఛాతీని తెరచి బైపాస్‌ సర్జరీయో చేస్తున్నారు. ఇవి రెండూ కాకుండా మూడో రకం చికిత్సకూ అవకాశం లేకపోలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. అదేంటో తెలుసా? తెల్ల రక్తకణాల సాయంతో పూడికలకు దారితీసే వాపు ప్రక్రియను నిలువరించటం. రక్తనాళాల్లో మాక్రోఫేజస్‌ అనే తెల్ల రక్తకణాలు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించి, పూడికలు ఏర్పడటానికి దారితీస్తాయనే ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే మాక్రోఫేజెస్‌లోని ఒకరకం కణాలకు పూడికలు ఏర్పడకుండా అడ్డుకునే గుణమూ ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి సీఎల్‌ఈసీ4ఏ2 అనే సీ-టైప్‌ లెక్టిన్‌ రిసెప్టర్‌ ఎక్కువగా వ్యక్తమయ్యేలా చేయటం ద్వారా వాపుప్రక్రియ మరీ ఎక్కువ కాకుండా అడ్డుకోవటం గమనార్హం. అంటే గుండె రక్తనాళాలకు చేటు చేసేవే కాదు.. మేలు చేసే కణాలూ వాటి లోపలే ఉన్నాయన్నమాట. వీటిని ప్రేరేపించే కొత్త మందుల రూపకల్పనతో పూడికల చికిత్స కొత్త మలుపు తిరగొచ్చని పరిశోధకులు గట్టిగానే ఆశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని