నిద్ర సంపన్నుల జన్యువులే వేరు

రాత్రిపూట 8-9 గంటలు పడుకున్నా కొందరు తెల్లారాక నిద్రమత్తులో జోగుతుంటారు. మరికొందరు కొద్దిసేపు నిద్రపోయినా మర్నాడు మంచి హుషారుగా ఉంటారు. ఇలాంటివారిని ఒకరకంగా ‘నిద్ర సంపన్నులు’ అనుకోవచ్చు.

Updated : 22 Mar 2022 05:56 IST

రాత్రిపూట 8-9 గంటలు పడుకున్నా కొందరు తెల్లారాక నిద్రమత్తులో జోగుతుంటారు. మరికొందరు కొద్దిసేపు నిద్రపోయినా మర్నాడు మంచి హుషారుగా ఉంటారు. ఇలాంటివారిని ఒకరకంగా ‘నిద్ర సంపన్నులు’ అనుకోవచ్చు. ఎందుకంటే 4-6 గంటల సేపే పడుకున్నా తెల్లారి వీరిలో ఎలాంటి అలసటా కనిపించదు. దీనికి కారణం తల్లిదండ్రులు లేదా వారి పూర్వికుల నుంచి సంక్రమించిన అరుదైన జన్యువులేనని శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా అధ్యయనం చెబుతోంది. వీరు మానసికంగా దృఢంగానూ ఉంటున్నారని పేర్కొంటోంది. నిద్ర సంపన్నుల్లో ఐదు ప్రత్యేక జన్యువులను పరిశోధకులు గుర్తించారు. అలాగే నిద్ర తీరుతెన్నులను ప్రభావితం చేసే డీఈసీ2, ఎన్‌పీఎస్‌ఆర్‌1 అనే జన్యువుల్లో మార్పులు తలెత్తినట్టూ కనుగొన్నారు. ఈ జన్యువులు గలవారి మెదడులో అమీలాయిడ్‌ ప్రొటీన్‌ నెమ్మదిగా పోగుపడుతున్నట్టు, టావు ప్రొటీన్‌ తక్కువగా ఉంటున్నట్టు గత అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా నివారణలో జన్యువుల పాత్రా కీలకమేనని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇవి మున్ముందు డిమెన్షియాకు సమర్థ చికిత్సల రూపకల్పనకు దారితీయగలవని ఆశిస్తున్నారు. సాధారణంగా ఆరోగ్యవంతులకు రాత్రిపూట 8 గంటల నిద్ర అవసరమని భావిస్తుంటారు. అయితే ఇది అందరికీ ఒకేలా వర్తించకపోవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని