కిడ్నీలకు ‘పోటు’

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కిడ్నీలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. నిర్లక్ష్యం చేస్తే చివరికి కిడ్నీ వైఫల్యమూ సంభవించొచ్చు. ఇంతకీ అధిక రక్తపోటుతో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయి? రహస్యమంతా ధమనులు, కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల గోడలు మందం కావటంలోనే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 29 Mar 2022 05:41 IST

దీర్ఘకాలంగా అధిక రక్తపోటుతో బాధపడేవారిలో కిడ్నీలు దెబ్బతినే ముప్పు ఎక్కువ. నిర్లక్ష్యం చేస్తే చివరికి కిడ్నీ వైఫల్యమూ సంభవించొచ్చు. ఇంతకీ అధిక రక్తపోటుతో కిడ్నీలు ఎలా దెబ్బతింటాయి? రహస్యమంతా ధమనులు, కిడ్నీల్లోని సూక్ష్మ రక్తనాళాల గోడలు మందం కావటంలోనే ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయంలో కిడ్నీల్లోని రెనిన్‌ కణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి రెనిన్‌ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఈ హార్మోన్‌ రక్తపోటు నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతుంది. కానీ రెనిన్‌ కణాల్లో హానికర మార్పులు సంభవించినప్పుడు ఇవి కిడ్నీల్లోని రక్తనాళాల గోడల్లోకి చొచ్చుకుపోతాయి. అప్పుడవి మృదు కండర కణాలనే మరో రకం కణాలు పోగయ్యేలా ప్రేరేపిస్తాయి. దీంతో రక్తనాళాల గోడలు మందమవుతాయి, గట్టిపడతాయి. ఫలితంగా రక్తనాళాలకు సాగే గుణం తగ్గుతుంది. కిడ్నీలకు రక్త ప్రవాహం అస్తవ్యస్తమవుతుంది, రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ దెబ్బతింటుంది. కాబట్టి రక్తపోటు నియంత్రణకు డాక్టర్లు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడుకోవాలి. అలాగే మంచి జీవనశైలిని అలవరచుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకం తగ్గించాలి. సిగరెట్లు కాల్చే అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. మద్యం జోలికి అసలే వెళ్లకూడదు. ఒకవేళ అలవాటుంటే పరిమితం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒక మాదిరి వ్యాయామమైనా రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతుంది. బరువు అదుపులో ఉంచుకోవాలి. కేవలం 5% బరువు తగ్గినా రక్తపోటు తగ్గుముఖం పట్టటం ఆరంభిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి మేలు చేస్తాయి. రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని