Computer Eye Strain: కంటికి ‘తెర’ దెబ్బ... తప్పించుకోవటమెలా?

కంప్యూటర్‌లతోనే ఎక్కువ సమయం పని చేసేవారికి స్క్రీన్‌ నుంచి వచ్చే వెలుతురు కళ్ల మీద తీవ్ర ప్రభావం (Computer Eye Strain) చూపిస్తుంది. సమస్య నుంచి ఎలా బయటపడాలంటే...

Updated : 29 Oct 2023 17:00 IST

ఆఫీసులోనైనా, ఇంట్లోనైనా డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ వంటి డిజిటల్‌ పరికరాల వాడకం పెరిగిపోయింది. రోజంతా వీటి తెరల వంక చూడటం కళ్ల మీద తీవ్ర ప్రభావమే చూపుతోంది. కళ్లు ఒత్తిడికి గురికావటం, పొడిబారటం వంటి సమస్యలెన్నో (Computer Eye Strain) చుట్టుముడుతున్నాయి. మరి వీటిని తప్పించుకోవటమెలా?

తగినంత దూరంగా..

ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ తెరలు కళ్ల నుంచి 25 అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. తెర పైభాగం కళ్లకు కాస్త కిందుగా ఉండాలి. వీటితో కళ్ల మీద పడే ఒత్తిడిని, కాంతి తీవ్రతను చాలావరకు తగ్గించుకోవచ్చు.

సహజ వెలుగులో

వీలైనంత వరకు ఎల్‌ఈడీ, ట్యూబ్‌లైట్ల వెలుగులో కన్నా సహజ కాంతిలో పనిచేసేలా చూసుకోవటం మంచిది. తలుపులు, కిటికీల ద్వారా గదిలోకి వచ్చే ఎండ, వెలుగు కళ్లకు విశ్రాంతి కలిగిస్తుంది. ఇది రోజంతా చురుకుగా ఉండటానికీ తోడ్పడుతుంది.

కాస్త విరామం

తదేకంగా డిజిటల్‌ పరికరాల తెరలను చూడటం తగ్గించుకోవాలి. గంటకోసారి కనీసం 5 నిమిషాల సేపైనా విరామం తీసుకోవాలి. దీంతో కళ్ల మీద ఒత్తిడి తగ్గటమే కాదు, ఏకాగ్రత పెరుగుతుంది. పని సామర్థ్యం మెరుగవుతుంది.

కళ్లకు ఒకింత వ్యాయామం

కళ్లు కూడా ఇతర కండరాల వంటివే. బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి వీటికీ వ్యాయామం అవసరమే. దీనికి తేలికైన మార్గం 20-20-20 నియమం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి తెర మీది నుంచి దృష్టిని మరల్చి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దృశ్యాలను చూడాలి. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది.

రెప్పలు ఆడించటం మరవద్దు

సాధారణంగా మనం ప్రతి నాలుగు సెకన్లకు ఒకసారి రెప్పలను ఆడిస్తాం. కానీ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ తెరలను చూస్తున్నప్పుడు ఇది సగానికి పైగా తగ్గిపోతుంది. కాబట్టి ప్రయత్న పూర్వకంగానైనా తరచూ రెప్పలను ఆడించటం అలవాటు చేసుకోవాలి. దీంతో కళ్లు పొడిబారటం, దురద పెట్టటం వంటివి తగ్గుతాయి.

ఫాంట్స్‌ పెద్దగా చేసుకోవాలి

ఫాంట్‌ సైజు సైతం కళ్ల మీద ప్రభావం చూపుతుంది. చిన్న ఫాంట్లను చదివేటప్పుడు దృష్టి మరింత ఎక్కువగా కేంద్రీకృతమవుతుంది. దీంతో కళ్లు త్వరగా ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి ఫాంట్స్‌ పెద్దగా చేసుకోవాలి.

తగినంత నీరు తాగాలి

తగినంత నీరు తాగటం కళ్లకూ మేలు చేస్తుంది. ఇది కళ్లు పొడిబారకుండా కాపాడుతుంది. చికాకు, దురద తగ్గుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని