గురకకు మందు!

గురక పెట్టేవారిలో గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో కాసేపు శ్వాస తీసుకోవటం ఆగుతుంది. దీన్నే స్లీప్‌ అప్నియా అంటారు.

Updated : 19 Apr 2022 02:27 IST

గురక పెట్టేవారిలో గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో కాసేపు శ్వాస తీసుకోవటం ఆగుతుంది. దీన్నే స్లీప్‌ అప్నియా అంటారు. దీనికి ప్రస్తుతం శ్వాస ఆగకుండా చూసే మాస్కులాంటి సీప్యాప్‌ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడుకునే తీరు అలవాటు కావటానికి కొంత సమయం పడుతుంది. పైగా చాలామంది సీప్యాప్‌ను వాడుకోవటానికి ఇష్టపడరు. అందుకే స్లీప్‌ అప్నియాకు సమర్థ ఔషధ చికిత్స అందుబాటులోకి వస్తే బాగుంటుందని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. కార్బోనిక్‌ యాన్‌హైడ్రేజ్‌ ఎంజైమ్‌ను నిలువరించే సల్‌థయామ్‌ అనే మందు సమర్థంగా పనిచేస్తున్నట్టు స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ గోథెన్‌బర్గ్‌ అధ్యయనంలో బయటపడింది. దీంతో నిద్రలో శ్వాస ఆగిపోవటం సగటున గంటకు 20 సార్లకు పైగా తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మంచి విషయం ఏంటంటే- కార్బోనిక్‌ యాన్‌హైడ్రేజ్‌ను నిలువరించే మందులు ఇప్పటికే అందుబాటులో ఉండటం. అధ్యయనంలో పరీక్షించిన సల్‌థయామ్‌ మందును ఒకప్పుడు పిల్లల్లో మూర్ఛ తగ్గటానికి వాడేవారు. ఇప్పుడిది స్లీప్‌ అప్నియాలో సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలటం గమనార్హం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని