చర్మం నిగనిగకు విటమిన్‌ డి

విటమిన్‌ డి అనగానే ఎముకలు, దంతాల పటుత్వమే గుర్తుకొస్తుంది. ఇది మనం తినే ఆహారంలోని క్యాల్షియంను గ్రహించుకునేలా చేస్తుంది మరి. రోగనిరోధక శక్తి, నాడుల వ్యవస్థ, మధుమేహ నియంత్రణ..

Published : 19 Apr 2022 02:27 IST

విటమిన్‌ డి అనగానే ఎముకలు, దంతాల పటుత్వమే గుర్తుకొస్తుంది. ఇది మనం తినే ఆహారంలోని క్యాల్షియంను గ్రహించుకునేలా చేస్తుంది మరి. రోగనిరోధక శక్తి, నాడుల వ్యవస్థ, మధుమేహ నియంత్రణ.. ఊపిరితిత్తులు, గుండె సజావుగా పనిచేయటంలోనూ పాలు పంచుకుంటుంది. ఇవే కాదు. చర్మం నిగనిగలాడటానికీ విటమిన్‌ డి తోడ్పడుతుంది. ఇది లోపించటం వల్ల పొడసూపే ప్రధాన లక్షణాల్లో చర్మం పొడిబారటం ఒకటి. వైద్య పరిభాషలో దీన్ని ఇచ్తియోసిస్‌ అంటారు. శరీరానికి రక్షణగా నిలిచే పైచర్మం పనితీరును పర్యవేక్షించే జన్యువుల్లో మార్పుల వల్ల ఇది తలెత్తుతుంది. ఈ పైచర్మం ఏర్పడటాన్ని ప్రోత్సహించే గ్రాహకాలను విటమిన్‌ డి ప్రేరేపిస్తుంది. ఇలా ఇది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. బ్యాక్టీరియాను, వాపుప్రక్రియను అణచివేసే గుణం ఉండటం వల్ల ఇది మొటిమలు ఏర్పడకుండానూ చూస్తుంది. చర్మం ముడతలు పడకుండానూ కాపాడుతుంది. విటమిన్‌ డి లోపంతో జుట్టు ఎక్కువగా ఊడటం, గోళ్లు పెళుసుగా అవటం వంటి ఇబ్బందులూ వేధిస్తాయి. రోజూ కాసేపు ఒంటికి ఎండ తగిలేలా చూసుకుంటే చర్మమే విటమిన్‌ డిని తయారు చేసుకుంటుంది. మాంసం, గుడ్డులోని పచ్చసొన, కొవ్వుతో కూడిన చేపల వంటి వాటితోనూ ఇది కొంతవరకు లభిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని