మూడో తరంలోనూ యాంటీబయాటిక్స్‌ దుష్ప్రభావం

కొందరు అనవసరంగా, డాక్టర్ల సలహా లేకుండా ఎడాపెడా యాంటీబయాటిక్‌ మందులు వేసుకుంటుంటారు. ఇది ఎంతమాత్రమూ తగదు. వీటిని విచ్చలవిడిగా వాడితే బ్యాక్టీరియాకు మందులను తట్టుకునే శక్తి వస్తుంది.

Updated : 03 May 2022 06:31 IST

కొందరు అనవసరంగా, డాక్టర్ల సలహా లేకుండా ఎడాపెడా యాంటీబయాటిక్‌ మందులు వేసుకుంటుంటారు. ఇది ఎంతమాత్రమూ తగదు. వీటిని విచ్చలవిడిగా వాడితే బ్యాక్టీరియాకు మందులను తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో మున్ముందు ఆ మందులు పనిచేయవు. మరింత శక్తిమంతమైన మందులు అవసరమవుతాయి. ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని గమనిస్తున్నాం. చిన్నాచితకా ఇన్‌ఫెక్షన్లు సైతం ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ యాంటీబయాటిక్‌ మందుల ప్రభావం అక్కడితోనే ఆగిపోయేది కాదు. ముందు తరాల్లోనూ కొనసాగుతుంది. క్లోరోటెట్రాసైక్లిన్‌ ప్రభావానికి గురైన చేపలకు పుట్టిన పిల్లల్లో బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యం, రోగనిరోధక కణాల సంఖ్య తగ్గినట్టు యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ డెన్మార్క్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలటమే దీనికి నిదర్శనం. ఈ దుష్ప్రభావాలు మూడో తరంలోనూ కొనసాగటం గమనార్హం. యాంటీబయాటిక్‌ మందులను మనుషులకే కాదు, పశువులకూ ఇస్తుంటారు. అతిగా వాడకం వల్లనో, నిర్లక్ష్యంతోనో ఇవి నీటిలోనూ కలుస్తుంటాయి. వ్యర్థజలాలు, భూగర్భజలాలు, కాలువలు, నదుల్లోనే కాదు.. చివరికి సీసాల్లో అమ్మే నీటిలోనూ యాంటీబయాటిక్‌ అవశేషాలు కనిపిస్తుంటాయి. వీటి ప్రభావాల తీరుతెన్నులను తెలుసుకోవటానికే పరిశోధకులు చేపలపై అధ్యయనం చేసి, తాజా విషయాన్ని గుర్తించారు. గత పరిశోధనల్లోనూ యాంటీబయాటిక్‌ మందుల దుష్ప్రభావాలు వెల్లడయ్యాయి. టెట్రాసైక్లిన్‌ అనే యాంటీబయాటిక్‌ మందు ప్రభావానికి గురైన తేళ్లకు పుట్టిన పిల్లల్లో వీర్యం నాణ్యత తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. వీటిల్లో వీర్యకణాల సంఖ్య 25% వరకు పడిపోయినట్టు కనుగొన్నారు. అందువల్ల యాంటీబయాటిక్‌ మందుల వాడకంలో అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం వహిస్తే మన ఆరోగ్యాన్ని మనమే ప్రమాదంలో పడేసుకున్నట్టు అవుతుందని అధ్యయనాల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు