Updated : 03 May 2022 06:35 IST

ఎండకు గుండె జాగ్రత్త!

ఎండకాలంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. గుండెజబ్బు గలవారికైతే మరింత జాగ్రత్త అవసరం. వాతావరణంలో అధిక వేడిని తట్టుకునే క్రమంలో చెమట ఎక్కువగా పోస్తుంది. ఇందుకోసం చర్మం వద్ద రక్తనాళాలు విప్పారతాయి. దీంతో చర్మానికి రక్త సరఫరా పెరిగి చెమట పడుతుంది. శరీరం చల్లబడుతుంది. చర్మానికి రక్త సరఫరా పెంచటానికి గుండె మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీంతో గుండె వేగం పెరుగుతుంది. గుండె వైఫల్యం వంటి జబ్బులతో బాధపడేవారు ఇలాంటి పరిస్థితికి సర్దుకోవటం కాస్త కష్టమవుతుంది. చెమటతో పాటు సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలూ బయటకు పోతాయి. పైగా గుండె జబ్బులతో బాధపడేవారు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులూ వాడుతుంటారు. ఇవీ గుండె మీద ఒత్తిడి పెరిగేలా చేస్తాయి. రక్తపోటు తగ్గటానికి వేసుకునే ఏసీఈ ఇన్‌హిబిటార్లు, క్యాల్షియం ఛానెల్‌ బ్లాకర్ల వంటి మందులూ శరీరం వేడికి స్పందించే తీరునూ మారుస్తుంటాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించటం మంచిది.

* బాల్కనీల్లో, ఇంటి కప్పు మీద ఎక్కడైనా గానీ వేడి వాతావరణంలో కఠినమైన వ్యాయామాలేవీ చేయొద్దు. నీడ పట్టున వ్యాయామాలు చేసుకోవాలి.

* కెఫీన్‌, మద్యం జోలికి వెళ్లకపోవటం మంచిది. ఇవి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసి ఒంట్లో నీటి శాతం తగ్గేలా చేస్తాయి.

* తేలికైన, గాలి ఆడేలా చూసే పలుచటి నూలు దుస్తులు ధరించాలి. లేత రంగు దుస్తులు వేసుకోవాలి.

* ఇంట్లో చల్లగా ఉండేలా, గాలి వచ్చి పోయేలా చూసుకోవాలి.

* రక్తపోటు మరీ పెరిగినా, తగ్గినా డాక్టర్‌ను సంప్రదించాలి.

* ఆయా లక్షణాలను బట్టి తరచూ రక్తంలో సోడియం, పొటాషియం మోతాదులను పరీక్షించుకోవాలి.

* గుండె వైఫల్యం, అధిక రక్తపోటు గల వృద్ధులకు మందుల మోతాదు మార్చాల్సిన అవసరముండొచ్చు. డాక్టర్‌ను సంప్రదిస్తే తగినట్టు మార్పులు చేస్తారు.

* గుండె వైఫల్యం గలవారు నీరు, ఉప్పు తక్కువగా తీసుకుంటుంటారు. ఇలాంటివారు డాక్టర్‌ను సంప్రదించి కాస్త నీరు ఎక్కువగా తాగొచ్చు. అవసరమైతే ఉప్పు మోతాదును సరిచేసుకోవాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని