ఆమె హృదయానికి మెనోపాజ్‌ చిక్కు

మగవారి కన్నా ఆడవారికి గుండెజబ్బు పదేళ్లు ఆలస్యంగా వస్తుంటుంది. దీనికి కారణం నెలసరి సమయంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ రక్షణ. ఇది మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ పెరిగేలా, చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ తగ్గేలా చేస్తుంది.

Published : 17 May 2022 00:46 IST

గవారి కన్నా ఆడవారికి గుండెజబ్బు పదేళ్లు ఆలస్యంగా వస్తుంటుంది. దీనికి కారణం నెలసరి సమయంలో విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ రక్షణ. ఇది మంచి (హెచ్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ పెరిగేలా, చెడ్డ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ తగ్గేలా చేస్తుంది. ఫలితంగా గుండెజబ్బు ముప్పూ తగ్గుతుంది. అయితే నెలసరి నిలిచిన (మెనోపాజ్‌) తర్వాత ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గుతుంది. అదే సమయంలో ఫాలిక్యుల్‌-స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (ఎఫ్‌ఎస్‌హెచ్‌) పెరుగుతుంది. ఈ మార్పులు గుండె ఆరోగ్యం క్షీణించటం మీద నేరుగా ప్రభావం చూపుతున్నట్టు ఫిన్‌లాండ్‌ పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. నెలసరి నిలిచిన దశలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువవుతున్నట్టు, ఇందులో 10% పెరుగుదలకు స్త్రీ హార్మోన్లలో మార్పులే కారణమవుతున్నట్టు తేలింది. హార్మోన్‌ భర్తీ చికిత్సతో ఇది కొంతవరకు మెరుగవుతున్నట్టు బయటపడింది. సాధారణంగా మహిళలకు 48-52 ఏళ్ల మధ్యలో రుతుక్రమం నిలిచిపోతుంటుంది. నెలసరి నిలవటం అనివార్యమే అయినప్పటికీ సమతులాహారం తినటం, వ్యాయామం చేయటం ద్వారా ప్రతికూల పరిణామాలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. హార్మోన్‌ భర్తీ చికిత్స తీసుకునే విషయంలో డాక్టర్‌తో చర్చించి, లాభనష్టాలను బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని