ఈ మధుమేహం కొవిడ్‌తో వచ్చిందా?

కొవిడ్‌ బారినపడ్డవారికి మధుమేహం రావటాన్ని ఇటీవల చూస్తున్నాం. స్టిరాయిడ్‌ మందులతోనో.. నేరుగా వైరస్‌ ప్రభావంతోనో మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటున్నాయి.

Updated : 08 Jan 2023 16:30 IST

సమస్య: నాకు ఇటీవల కొవిడ్‌ వచ్చి, తగ్గింది. తర్వాత మధుమేహం మొదలైంది. ఇది కొవిడ్‌తో వచ్చిందా? లేకపోతే వయసుతో పాటు వచ్చిందా? నాకు అర్థం కావటం లేదు.

- విశ్వ, హైదరాబాద్‌

సలహా: కొవిడ్‌ బారినపడ్డవారికి మధుమేహం రావటాన్ని ఇటీవల చూస్తున్నాం. స్టిరాయిడ్‌ మందులతోనో.. నేరుగా వైరస్‌ ప్రభావంతోనో మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కొవిడ్‌లో శరీరం విపరీతమైన ఒత్తిడికి గురికావటమూ దీనికి దారితీయొచ్చు. కారణమేదైనా మధుమేహం వచ్చిన వెంటనే మందులు వేసుకోవాలి. పెద్ద వయసులో వచ్చే టైప్‌2 మధుమేహంలో రక్తంలో గ్లూకోజు 125 నుంచి 140 మి.గ్రా. వరకు ఉంటే మందులు అవసరం లేదని ఒకప్పుడు భావించేవాళ్లం. కానీ ఇప్పుడలా కాదు. వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసులోనైనా.. అంతకుముందు కొవిడ్‌ వచ్చినా, రాకున్నా.. స్టిరాయిడ్‌ మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటే మందులు వేసుకోవాల్సిందే.


డయాబెటిస్‌లో కాలేయ జబ్బులా?

సమస్య: ఫ్యాటీ లివర్‌ అంటే ఏంటి? మధుమేహుల్లో కాలేయానికి సంబంధించి ఎలాంటి జబ్బులు వస్తాయి?

- లక్ష్మి, హైదరాబాద్‌

సలహా: మధుమేహం గలవారిలో గుండెజబ్బుల మాదిరిగానే కాలేయ జబ్బులకూ ప్రాధాన్యం ఇవ్వాలని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. మధుమేహం నియంత్రణలో లేనివారిలో మద్యం, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు, పిత్తాశయ సమస్యలతో సంబంధం లేకుండా కాలేయంలో కొవ్వు పదార్థం పేరుకుపోతుంది (ఫ్యాటీ లివర్‌). గతంలో అల్ట్రాసౌండ్‌ పరీక్షలు అంతగా చేసేవారు కాదు కాబట్టి దీని గురించి తెలిసేది కాదు. ఇప్పుడు తరచూ అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేస్తున్న నేపథ్యంలో మధుమేహుల్లో కాలేయానికి కొవ్వు పడుతున్నట్టు బయటపడుతోంది. ఇది వాపు ప్రక్రియను ప్రేరేపించి కాలేయంలోని కణజాలం గట్టిపడేలా చేస్తుంది కూడా. ఇది క్రమంగా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముంది. మంచి విషయం ఏంటంటే- కాలేయంలో కొవ్వు పదార్థాన్ని తగ్గించుకునే వీలుండటం. సాధారణంగా మధుమేహ దుష్ప్రభావాలు మొదలైతే వెనక్కి మళ్లించటం అసాధ్యం. కానీ ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించటం, బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా కాలేయ కొవ్వును తగ్గించుకోవచ్చు. బరువును 15% తగ్గించుకోగలిగితే కాలేయ కొవ్వు సమస్యను వెనక్కి మళ్లించుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పయోగ్లిటజోన్‌, సెమాగ్లుటైడ్‌ వంటి మందులతోనూ ఫ్యాటీ లివర్‌ తగ్గుతున్నట్టు బయటపడింది.


మీ సమస్యలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని