గురక చికిత్సతో జ్ఞాపకశక్తి మెరుగు

కొందరికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీన్నే స్లీప్‌ అప్నియా అంటారు. దీంతో కొద్దిసేపు శ్వాస ఆగుతుంది. అప్పుడు ఉక్కిరి బిక్కిరై హఠాత్తుగా పెద్దగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటుంటారు. ఇలా...

Updated : 24 May 2022 00:32 IST


 

కొందరికి నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీన్నే స్లీప్‌ అప్నియా అంటారు. దీంతో కొద్దిసేపు శ్వాస ఆగుతుంది. అప్పుడు ఉక్కిరి బిక్కిరై హఠాత్తుగా పెద్దగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటుంటారు. ఇలా రాత్రంతా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. దీంతో ఒకవైపు నిద్రకు భంగం కలుగుతుంది. మరోవైపు రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులు తగ్గుతాయి. ఫలితంగా తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా ముప్పూ పెరుగుతుంది. వీరికి విషయ గ్రహణ సామర్థ్యం తగ్గే ముప్పు 26% ఎక్కువని, మెదడులో బీటా అమీలాయిడ్‌ ప్రొటీన్‌ కూడా ఎక్కువగానే ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి గురకకు చికిత్స చేస్తే జ్ఞాపకశక్తి మెరుగవుతుందా? స్వల్పకాలంలో ఇది సాధ్యమేనని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. స్లీప్‌ అప్నియాతో బాధపడేవారికి నిద్రలో శ్వాస ఆగిపోకుండా చూడటానికి సీప్యాప్‌ చికిత్స సూచిస్తుంటారు. మాస్కులాగా ఉండే దీన్ని ముఖానికి ధరిస్తే స్థిరమైన వేగంతో గాలి లోపలికి వెళ్లేలా చేస్తుంది. దీంతో గురక తగ్గుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. ఇది మతిమరుపు, ఏకాగ్రత లోపించటం, సంక్లిష్ట నిర్ణయాలు తీసుకోలేకపోవటం, భాషా సమస్యలు ఎదుర్కోవటం వంటి వాటిని స్వల్పకాలంలో తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలంలో ఇదెలా పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని