Stress or Anxiety: ఒత్తిడి.. ఆందోళన.. రెండూ ఒకటేనా?వేర్వేరా?

మనిషి జీవితంలో ఒత్తిడి (Stress) అనేది సహజం. చదువు నుంచి ఉద్యోగం, వ్యాపారం వరకు అన్నింటా ఈ పరిస్థితి ఉంటుంది. ఇక ఆందోళన  (Anxiety) పరిస్థితీ అంతే. అయితే రెండూ ఒకటేనా? వేర్వేరా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!

Updated : 19 Feb 2023 15:59 IST

జీవితంలో ఒత్తిడి (Stress) సహజం. రోజువారీ వ్యవహారాల్లో తరచూ ఎదుర్కొనేదే. చదువులు, ఉద్యోగాల దగ్గర్నుంచి అనూహ్యమైన ఘటనల వరకూ అన్నీ ఒత్తిడికి గురిచేసేవే. దీన్నే కొందరు ఆందోళన (Anxiety) అనుకుంటుంటారు. నిజానికి రెండింటికీ తేడా ఉంది. కొన్నిసార్లు రెండూ కలగలసి కూడా ఉండొచ్చు.

ఒత్తిడి అంటే?

బయటి కారణాలకు శరీరం లేదా మనసు ప్రతిస్పందించే తీరు. ఉదాహరణకు- చేయాల్సిన హోంవర్క్‌ చాలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గంటలోపు పని పూర్తిచేయాల్సి ఉంది. లేదూ ఏదో తీవ్రమైన జబ్బు వచ్చింది. ఇలాంటి పరిస్థితులు సహజంగానే ఒత్తిడికి గురిచేస్తుంటాయి. కొన్ని మనసును ప్రభావితం చేస్తే, కొన్ని శరీరాన్ని ప్రభావితం చేయొచ్చు. ఒత్తిడికి కారణమయ్యేవి ఒకసారికి, కొద్దికాలానికే పరిమితం కావొచ్చు. కొన్నిసార్లు తరచూ ఎదురవుతుండొచ్చు.

ఆందోళన అంటే?

ఒత్తిడికి శరీరం స్పందించే తీరునే ఆందోళన అంటాం. ప్రస్తుతం ఎలాంటి ముప్పు, ప్రమాదం లేకపోయినా ఆందోళన కలగొచ్చు. ఇది తగ్గకపోతే రోజువారీ జీవితంలోనూ ఆటంకంగా పరిణమించొచ్చు. ఆరోగ్యం మీదా ప్రభావం చూపొచ్చు. నిద్ర సరిగా పట్టకపోవచ్చు. రోగనిరోధకశక్తి, జీర్ణకోశం, గుండె, పునరుత్పత్తి వ్యవస్థల పనితీరూ అస్తవ్యవస్తం కావొచ్చు. కుంగుబాటు వంటి మానసిక సమస్యలకూ దారితీయొచ్చు.

తగ్గించుకోవటమెలా?

ఒత్తిడిని ప్రేరేపిస్తున్న అంశాలేంటి? ఆందోళన తగ్గటానికి తోడ్పడే పద్ధతులేంటి? అనేవి గురిస్తే చాలావరకు తగ్గించుకోవచ్చు. అందరికీ ఒకే విధానాలు పనిచేయకపోవచ్చు. ఏవి ఉపయోగపడుతున్నాయి, ఏవి పనికి రావటం లేదనేవి క్రమంగా అవగతమవుతాయి.

  • ఎప్పుడెప్పుడు ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నామో ఒకచోట (డైరీలో) నమోదు చేసుకోవాలి.
  • ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి మానసిక విశ్రాంతి కలిగించే పద్ధతులు పాటించాలి. అవసరమైతే వీటిని నేర్చుకోవటానికి, అభ్యాసం చేయటానికి తోడ్పడే యాప్‌లు వాడుకోవచ్చు.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. వేళకు భోజనం చేయాలి.  
  • రోజూ ఒకే సమయానికి పడుకోవాలి, లేవాలి. కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి.
  • కెఫీన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, కూల్‌డ్రింకులు తాగటం మానెయ్యాలి.
  • ప్రతికూల ఆలోచనలను గుర్తించి, వాటిని తొలగించుకోవటానికి ప్రయత్నించాలి.
  • సమస్యను అర్థం చేసుకొని, బయట పడటానికి తోడ్పడే కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం తీసుకోవాలి.

అవసరమైతే చికిత్స

ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడలేకపోతున్నా.. లక్షణాలు, ఇబ్బందులు ఎక్కువవుతున్నా మానసిక వైద్యులను సంప్రదించాలి. ఆలోచన తీరును మార్చే కౌన్సెలింగ్‌ బాగా ఉపయోగ పడుతుంది. అవసరమైతే మందులు కూడా వాడుకోవాలి.


తేడా ఏంటి? 

ఒత్తిడి

  • సాధారణంగా పరీక్షలకు హాజరు కావటం, స్నేహితుడితో గొడవ వంటి బయటి కారణాలకు స్పందించటం వంటి వాటితో ముడిపడి ఉంటుంది. పరిస్థితి కుదురుకున్నాక తగ్గిపోతుంది.
  • సానుకూలంగా, ప్రతికూలంగా రెండు రకాలుగా ప్రభావం చూపొచ్చు. గడువు లోగా పని చేయించొచ్చు. గాబరా, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీయొచ్చు.

ఒత్తిడి, ఆందోళన

  • ఇవి మనసు మీద, శరీరం మీద ప్రభావం చూపొచ్చు. దీంతో రకరకాల లక్షణాలు పొడసూపొచ్చు.
  • అతిగా బాధపడటం.
  • విచారం, దుఃఖం.
  • ఉద్రిక్తత
  • తలనొప్పి, ఒళ్లు నొప్పులు
  • నిద్రలేమి

ఆందోళన

  • చాలావరకూ అంతర్గతమైంది. అంటే ఒత్తిడికి స్పందించే తీరు.
  • విడవకుండా భయానికి గురవటం. ఇది రోజువారీ పనుల మీదా ప్రభావం చూపుతుంది.
  • నిరంతరం ఉంటుంది.తక్షణ ప్రమాదం లేకపోయినా వేధిస్తుంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని