ఏకాగ్రతకూ పండ్లు, కూరగాయలు

ఏకాగ్రతను దెబ్బతీసే అతిచురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్య పిల్లలకు చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. వీరు కుదురుగా ఒకచోట ఉండలేరు. దేని మీదా ఎక్కువ సేపు ధ్యాస పెట్టలేరు. విషయాలను గుర్తుంచుకోవటమూ తక్కువే. కోపం వంటి భావోద్వేగాలనూ నియంత్రించుకోలేరు.

Updated : 25 Jul 2022 23:02 IST

ఏకాగ్రతను దెబ్బతీసే అతిచురుకుదనం (ఏడీహెచ్‌డీ) సమస్య పిల్లలకు చాలా చిక్కులు తెచ్చిపెడుతుంది. వీరు కుదురుగా ఒకచోట ఉండలేరు. దేని మీదా ఎక్కువ సేపు ధ్యాస పెట్టలేరు. విషయాలను గుర్తుంచుకోవటమూ తక్కువే. కోపం వంటి భావోద్వేగాలనూ నియంత్రించుకోలేరు. ఇలాంటివారికి పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తున్నట్టు అమెరికాలోని ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. వీటితో ఏడీహెచ్‌డీ లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు కనుగొన్నారు. మెదడులో కొన్ని నాడీ సమాచార వాహకాల మోతాదులు తగ్గటానికీ ఏడీహెచ్‌డీకీ సంబంధం ఉంటున్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నాడీ సమాచార వాహకాల తయారీలో, మొత్తంగా మెదడు పనితీరులో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలితో ఉన్నప్పుడు ఎవరికైనా చికాకు కలుగుతుంది. ఏడీహెచ్‌డీ పిల్లలూ దీనికి మినహాయింపు కాదు. తగినంత ఆహారం తినకపోతే లక్షణాలు మరింత తీవ్రం కావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పిల్లలకు తగినంత తిండి ఇవ్వలేని సందర్భాల్లో తల్లిదండ్రుల్లో తలెత్తే ఒత్తిడి కుటుంబంలో గొడవలకు దారితీస్తోందని, ఇదీ పిల్లల్లో ఏకాగ్రత లోపించటం వంటి లక్షణాలు తీవ్రమయ్యేలా చేస్తోందనీ వివరిస్తున్నారు. సాధారణంగా ఏడీహెచ్‌డీ లక్షణాలు ఎక్కువైనప్పుడు డాక్టర్లు మందుల మోతాదు పెంచుతుంటారు. మందులు వేసుకోనివారికైతే చికిత్స ఆరంభిస్తారు. దీనికన్నా ముందు పిల్లలకు తగినంత ఆహారం అందుబాటులో ఉంటోందా? ఎంత మంచి ఆహారం తింటున్నారు? అనేవి పరిశీలించటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని