పొడవు వారికి నాడీ జబ్బుల ముప్పు!

జబ్బుల ముప్పు కారకాలు అనగానే బరువు, బొజ్జ వంటివే గుర్తుకొస్తాయి. కానీ పొట్టి, పొడవులూ తక్కువేమీ కావు. శరీర ఎత్తుకూ గుండెజబ్బల దగ్గర్నుంచి క్యాన్సర్ల వరకు రకరకాల జబ్బులకూ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే తేలింది.

Updated : 07 Jun 2022 05:52 IST

జబ్బుల ముప్పు కారకాలు అనగానే బరువు, బొజ్జ వంటివే గుర్తుకొస్తాయి. కానీ పొట్టి, పొడవులూ తక్కువేమీ కావు. శరీర ఎత్తుకూ గుండెజబ్బల దగ్గర్నుంచి క్యాన్సర్ల వరకు రకరకాల జబ్బులకూ సంబంధం ఉంటున్నట్టు ఇప్పటికే తేలింది. అయితే కేవలం ఎత్తేనా? దీని విషయంలో పాలు పంచుకునే ఆహారం, సామాజిక ఆర్థిక స్థితులా? వీటిల్లో ఏదీ కారణమవుతోందనేది శాస్త్రవేత్తలు తేల్చలేకపోయారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని రాకీ మౌంటెయిన్‌ రీజినల్‌ వీఏ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు శరీర ఎత్తుతో ముడిపడిన జన్యు విశ్లేషణపై దృష్టి సారించారు. పొడవు వారికి గుండెలయ తప్పటం, కాలిసిరల్లో రక్తం గడ్డల ముప్పు పెరుగుతున్నట్టు.. గుండెజబ్బు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌ ముప్పు తక్కువగా ఉంటున్నట్టు గతంలో తేలిన విషయం నిజమేనని నిర్ధరించారు. అలాగే వీరికి కాళ్లు, చేతుల్లో నాడులు దెబ్బతినటం.. కాళ్లు, పాదాల మీద పుండ్లు పడటానికి దోహదం చేసే చర్మ, ఎముక ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరుగుతున్నట్టూ కొత్తగా గుర్తించారు. జన్యువులతో అంచనా వేసిన ఎత్తు, శారీరక ఎత్తు ఒకేలా ఉండటం గమనార్హం. అంటే మామూలు టేపుతో ఎత్తును కొలవటం ద్వారానే జబ్బుల ముప్పును గుర్తించే అవకాశం ఉందన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని