మోకీళ్లకు ఊబకాయం దెబ్బ!

మోకాళ్ల కోసమైనా బరువు అదుపులో ఉంచుకోండి! ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. అధిక బరువు, ఊబకాయంతో మోకాళ్ల మీద భారం పెరుగుతుంది. త్వరగా అరిగిపోయే ప్రమాదమూ ఉంది. పరిస్థితి విషమిస్తే చిన్న వయసులోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది.

Updated : 14 Jun 2022 10:13 IST

మోకాళ్ల కోసమైనా బరువు అదుపులో ఉంచుకోండి! ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. అధిక బరువు, ఊబకాయంతో మోకాళ్ల మీద భారం పెరుగుతుంది. త్వరగా అరిగిపోయే ప్రమాదమూ ఉంది. పరిస్థితి విషమిస్తే చిన్న వయసులోనే మోకాలి మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఆస్ట్రేలియాలోని ద యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌లాండ్‌ రూరల్‌ క్లినిక్‌ స్కూలు అధ్యయనం ఇలాగే హెచ్చరిస్తోంది. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నవారిలో 57.7% మంది ఊబకాయులేనని పేర్కొంటోంది. 55-64 ఏళ్ల వయసులో- మామూలు బరువు గలవారితో పోలిస్తే ఊబకాయ మహిళలకు 17.3 రెట్లు ఎక్కువగా.. ఊబకాయ పురుషులకు 5.8 రెట్లు ఎక్కువగా మోకాలి మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఎక్కువగా ఉన్న ఊబకాయులు సగటున ఏడేళ్ల ముందుగానే మోకాలి మార్పిడి చేయించుకుంటున్నారనీ బయటపడింది. మనదేశంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయులే! మనదగ్గర సుమారు 22-39% మంది కీళ్ల అరుగుదలతో బాధపడుతున్నారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఊబకాయులే. ఈ నేపథ్యంలో తాజా అధ్యయన ఫలితాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి.

బరువు ఒక మాదిరిగా తగ్గినా మోకీళ్ల మీద భారం తగ్గుతుంది. నొప్పి, వాపు తగ్గుతాయి. కీళ్లు అరిగిపోవటం నెమ్మదిస్తుంది. కాబట్టి అధిక బరువు, ఊబకాయం గలవారు బరువు తగ్గించుకోవటం మీద దృష్టి పెట్టటం మంచిది. దీంతో మోకీళ్లు త్వరగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మోకీళ్ల మార్పిడి అవసరాన్నీ తప్పించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని