పళ్లు అరిగితే? విరిగితే?

నాకు 54 ఏళ్లు. అధిక రక్తపోటు, మధుమేహం లేవు. నోట్లో పక్క దంతాలు పుచ్చి, విరిగిపోయాయి. గుంతలు పడ్డాయి. మిగతా దంతాలూ బాగా అరిగిపోయాయి. చిగుళ్లు వాచి, నొప్పి పుడుతున్నాయి. ఒకోసారి చీము పడుతోంది. మందులు కొనుక్కొని వేసుకుంటున్నా

Updated : 14 Jun 2022 06:10 IST

సమస్య: నాకు 54 ఏళ్లు. అధిక రక్తపోటు, మధుమేహం లేవు. నోట్లో పక్క దంతాలు పుచ్చి, విరిగిపోయాయి. గుంతలు పడ్డాయి. మిగతా దంతాలూ బాగా అరిగిపోయాయి. చిగుళ్లు వాచి, నొప్పి పుడుతున్నాయి. ఒకోసారి చీము పడుతోంది. మందులు కొనుక్కొని వేసుకుంటున్నా తాత్కాలికంగానే ఉపశమనం కలుగుతుంది. రోజూ పడుకునే ముందు గోరువెచ్చటి నీటిలో పసుపు, ఉప్పు వేసి పుక్కిలిస్తుంటాను. తగ్గినట్టే తగ్గి మళ్లీ బాధిస్తున్నాయి. దీనికి పరిష్కారమేంటి?

- టి.వి.టి. రాజు, ఖమ్మం

సలహా: మీరు ఏకకాలంలో పళ్లు పుచ్చిపోవటం, అరగటం, విరగటం, చిగుళ్ల వాపు సమస్యలతో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. మీకు ముందుగా దవడ ఎముకకు ఎక్స్‌రే తీయాల్సి ఉంటుంది. ఇందులో దవడ ఎముక ఎలా ఉంది? దంతాల మూలాలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు తెలుస్తాయి. విరిగిపోయిన పళ్లను తొలగించాల్సి ఉంటుంది. వాటి స్థానంలో కట్టుడు పళ్లను అమర్చొచ్చు. తొలగించిన పంటికి రెండు పక్కల ఉన్న పళ్ల ఆధారంతో కృత్రిమ దంతాన్ని (బ్రిడ్జి పద్ధతిలో) ఏర్పాటు చేయొచ్చు. దవడ ఎముక బలంగా ఉంటే ఇంప్లాంట్స్‌ పెట్టి, వాటిపై కృత్రిమ దంతాలను అమర్చొచ్చు. ఈ పద్ధతిలో చిన్న శస్త్రచికిత్సతో స్క్రూ వంటి పరికరాన్ని దవడ ఎముకలో బిగిస్తారు. ఇది ఎముకను గట్టిగా పట్టుకొని ఉండిపోతుంది. దీనిపై కృత్రిమ దంతాన్ని అమరిస్తే, అది సహజ శాశ్వత దంతం మాదిరిగానే పనిచేస్తుంది. అరిగిపోయిన పళ్ల విషయంలో- అవి ఎంతవరకు అరిగిపోయాయనే దానిపై చికిత్స ఆధారపడి ఉంటుంది. కొద్దిగానే అరిగితే డీ సెన్సిటైజేషన్‌ టూత్‌పేస్ట్‌ వాడితే సరిపోతుంది. ఎక్కువగా అరిగిపోతే- ఏ స్థితిలో ఉందనేది ముఖ్యం. అంత ఎక్కువగా అరగకపోతే అక్కడ వేరే పదార్థం వేసి (ఫిల్లింగ్‌) సరిచేయాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా అరిగితే దంత మూలాన్ని శుభ్రం చేసి, క్షీణించిన భాగాన్ని తొలగించి (రూట్‌ కెనాల్‌ చికిత్స).. పైన క్యాప్‌ బిగించాల్సి ఉంటుంది. మీరు చాలాకాలంగా నొప్పి, వాపుతో బాధపడుతున్నానని రాశారు. దీనికి చిగుళ్లజబ్బు కారణమై ఉండొచ్చు. చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరైన చికిత్స తీసుకోరు. ఏవేవో చిట్కా వైద్యాలు ప్రయత్నిస్తుంటారు. వీటితో ఫలితం ఉండదు. నొప్పి నివారణ మందులతో కాసేపు ఉపశమనం లభించినా లోపల సమస్య అలాగే ఉంటుంది. వైద్యులు సూచించిన యాంటీబయాటిక్‌ మందులు వాడితేనే ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది. అలాగే దంతాలను పూర్తిగా శుభ్రం చేయాల్సి (క్లీనింగ్‌, స్కేలింగ్‌) ఉంటుంది కూడా. లేజర్‌ చికిత్సా అవసరమవ్వచ్చు. మీరు దంత వైద్యుడిని సంప్రదిస్తే పరీక్షలు చేసి, తగిన చికిత్స చేస్తారు.


- డా।। వికాస్‌ గౌడ్‌, డెంటల్‌ సర్జన్‌


మీ ఆరోగ్య సమస్యలు, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు