కాలేయ క్యాన్సర్‌ తీరు మారుతోంది!

హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్లు.. మద్యం, మద్యంతో సంబంధంలేని కాలేయవాపు.. కాలేయ క్యాన్సర్‌ ప్రధాన కారణాలు ఇవే. కానీ దీని పుట్టుక తీరుతెన్నులు మారిపోతున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సాన్‌ డీగో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది.

Published : 28 Jun 2022 03:08 IST

హెపటైటిస్‌ బి, సి ఇన్‌ఫెక్షన్లు.. మద్యం, మద్యంతో సంబంధంలేని కాలేయవాపు.. కాలేయ క్యాన్సర్‌ ప్రధాన కారణాలు ఇవే. కానీ దీని పుట్టుక తీరుతెన్నులు మారిపోతున్నాయని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా సాన్‌ డీగో స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఒకవైపు హెపటైటిస్‌ బి టీకాలు తీసుకోవటం, యాంటీవైరల్‌ చికిత్సతో హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్లతో ముడిపడిన క్యాన్సర్లు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు మద్యం తాగటం, ఊబకాయం గణనీయంగా పెరగటం పెను ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అయితే ప్రాణాలు తీయటంలో మాత్రం కాలేయ క్యాన్సర్‌ తీరేమీ మారలేదు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ మరణాలకు ఇప్పటికీ మూడో అతిపెద్ద కారణంగానే నిలుస్తోంది. ప్రస్తుతం మనదేశంలో 2.67 కోట్ల మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నారని అంచనా. 2025 కల్లా వీరి సంఖ్య 2.98 కోట్లకు చేరుకోవచ్చని.. వీరిలో 4.6 శాతం మంది కాలేయ క్యాన్సర్‌ బాధితులు ఉండొచ్చని భావిస్తున్నారు. కాలేయ క్యాన్సర్‌తో ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనదేశంలో రోజురోజుకీ మద్యం వాడకం, అధిక బరువు, ఊబకాయం పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మద్యంతో కాలేయవాపు తలెత్తుతుంది. ఇందులో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి వాపుప్రక్రియకు దారితీస్తుంది. ఇది క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేస్తుంది. మద్యం తాగనివారిలోనూ కాలేయంలో కొవ్వు పేరుకుపోవచ్చు. మనదేశంలో సుమారు 40 శాతం మంది ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయంతోనూ కాలేయ క్యాన్సర్‌ వచ్చే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని