Vitamin C: రోజుకు విటమిన్‌ C ఎంత అవసరం? ఎక్కడ లభిస్తుంది?

‘సంతోష’ రసాయనం గురించి తెలుసా? అది ఎలా శరీరంలోకి వస్తుందో తెలుసా? ఇదిగో వివరాలు. (Vitamin C)

Updated : 11 Jul 2023 14:21 IST

విటమిన్‌ సి ప్రయోజనాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది రోగనిరోధకశక్తి (Immunity) పుంజుకోవటం. నిజానికిది మానసిక స్థితినీ మెరుగు పరుస్తుంది. హుషారు, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. విటమిన్‌ సి (Vitamin C) మెదడులో నాడీసమాచార వాహికల ఉత్పత్తికి అత్యవసరం మరి. డోపమైన్‌ అనే నాడీసమాచార వాహకం సంతోషం, ఉత్సాహం కలగజేస్తుంది. అందుకే దీన్ని ‘సంతోష’ రసాయనం అంటారు. తగినంత విటమిన్‌ సి తీసుకోకపోతే డోపమైన్‌ మోతాదులు పడిపోతాయి. డోపమైన్‌ను నార్‌ఎపినెఫ్రిన్‌ అనే మరో నాడీ సమాచార వాహకంగా మార్చటంలోనూ ఇది పాలు పంచుకుంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

నార్‌ఎపినెఫ్రిన్‌ మోతాదులు పడిపోతే నిరాశ, ఆందోళన వంటివి తలెత్తుతాయి. చాలా మానసిక సమస్యలు వాపు ప్రక్రియతో ముడిపడి ఉండటం గమనార్హం. డోపమైన్‌, నార్‌ఎపినెఫ్రిన్‌లు మెదడులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) తలెత్తకుండానూ చూస్తాయి. అందుకే ప్రస్తుతం మానసిక నిపుణులు దీన్ని నిలువరించటం మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. మన పేగులకు, మెదడుకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది. కాబట్టి పేగుల్లో వాపుప్రక్రియను నిలువరించటం కీలకంగా మారుతోంది. ఇందుకు విటమిన్‌ సి తోడ్పడుతుంది. దీంతో మరో ప్రయోజనం శక్తిని పెంపొందించటం. వాపుప్రక్రియ ప్రేరేపితమైనప్పుడు శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది.

దీని నుంచి కోలుకోవటానికి ఎక్కువ శక్తి అవసరం. విటమిన్‌ సితో కేలరీలు లభించకపోయినా శక్తి బాగా పెంపొందుతుంది. కాబట్టి తరచూ నిరాశ, కుంగుబాటు, ఆందోళన కలుగుతున్నట్టు భావిస్తే విటమిన్‌ సి లభించే పదార్థాలను తిని చూడటం మంచిది. మనకు రోజుకు 65 మి.గ్రా నుంచి 90 మి.గ్రా. విటమిన్‌ సి అవసరం. ఇది నారింజ, బత్తాయి వంటి నిమ్మజాతి పండ్లు.. క్యాప్సికం, బ్రకోలీ వంటి వాటిల్లో దండిగా ఉంటుంది. ఒక్క నారింజ పండుతోనే 82 మి.గ్రా. విటమిన్‌ సి లభిస్తుంది. ఇది రోజంతా సరిపోతుంది. ఎర్ర క్యాప్సికంలో 342 మి.గ్రా., బ్రకోలీలో 89 మి.గ్రా. విటమిన్‌ సి ఉంటుంది. ఇంత తేలికగా విటమిన్‌ సి, దీంతో పాటు హుషారునూ పొందే అవకాశముంటే ఇంకెందుకు ఆలస్యం?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు