తొలిదశ రొమ్ముక్యాన్సర్‌లో కొందరికి సర్జరీయే చాలు!

తొలిదశ రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్నవారిలో అందరికీ రేడియోథెరపీ అవసరం లేదా? సర్జరీ చేస్తే సరిపోతుందా? మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ తాజా అధ్యయం ఇదే సూచిస్తోంది.

Updated : 05 Jul 2022 06:06 IST

తొలిదశ రొమ్ముక్యాన్సర్‌తో బాధపడుతున్నవారిలో అందరికీ రేడియోథెరపీ అవసరం లేదా? సర్జరీ చేస్తే సరిపోతుందా? మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ తాజా అధ్యయం ఇదే సూచిస్తోంది. తొలిదశ రొమ్ముక్యాన్సర్‌ గల 55 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గల మహిళల్లో కొందరికి సర్జరీ తర్వాత రేడియోథెరపీ అవసరం లేకపోవచ్చని టిమోతీ వేలన్‌ నేతృత్వంలోని పరిశోధక బృందం గుర్తించింది. నెమ్మదిగా వృద్ధి చెందే, చికిత్సకు బాగా స్పందించే ల్యూమినల్‌ ఎ రకం రొమ్ముక్యాన్సర్‌ ఆనవాళ్లు గలవారికి తొలిదశలో సర్జరీ, హార్మోన్లతోనే సమర్థంగా చికిత్స చేయొచ్చని వేలన్‌ చెబుతున్నారు. ల్యూమినల్‌ ఎ రకం రొమ్ముక్యాన్సర్‌ బాధితులను సర్జరీ అనంతరం ఐదేళ్ల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. రేడియోథెరపీ చేయించుకోనివారిలో క్యాన్సర్‌ తిరగబెట్టే అవకాశం 2.3 శాతం మాత్రమే ఉంటున్నట్టు కనుగొన్నారు. సాధారణంగా తొలిదశ రొమ్ముక్యాన్సర్‌ బాధితులకు సమస్య మళ్లీ తిరగబెట్టకుండా 3-5 వారాల పాటు రేడియోథెరపీ ఇస్తుంటారు. అయితే దీతో నిస్సత్తువ, చర్మం మంట పుట్టటం వంటి దుష్ప్రభావాలూ పొడసూపుతుంటాయి. కొందరికి రొమ్ము కుంచించుకుపోవచ్ఛు అరుదుగా గుండెజబ్బులు, మరోసారి క్యాన్సర్లు రావటం వంటి తీవ్ర సమస్యలూ తలెత్తొచ్చు. ఈ నేపథ్యంలో రేడియోథెరపీ అవసరం లేనివారిని గుర్తించటం ఆసక్తి కలిగిస్తోందని వేలన్‌ అంటున్నారు. దీంతో రేడియోథెరపీ దుష్ప్రభావాలూ తప్పుతాయని వివరిస్తున్నారు. అందుకే ఇప్పుడు ల్యూమినల్‌ ఎ రకం రొమ్ముక్యాన్సర్‌ గలవారిలో పదేళ్ల వరకు రేడియోథెరపీ రహిత చికిత్స సామర్థ్యాన్ని తెలుసుకోవటంపై పరిశోధకులు దృష్టి సారించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని