Updated : 05 Jul 2022 10:13 IST

ఏమిటీ మూర్ఖత్వం?

సమస్య: మాకు నాలుగేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఇంకా సంతానం కాలేదు. డాక్టర్‌ను సంప్రదించి మందులు వాడుతున్నాం. ఇంతవరకు బాగానే ఉంది గానీ నా భార్య మూఢత్వంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. తనకు వచ్చిన ప్రతీ కలకు ఏదో ఒక అర్థం చెబుతుంది. తననెవరో వెంబడిస్తున్నారని, తనపై ఎవరో ఏదో ప్రయోగిస్తున్నారని అపోహ పడుతుంది. ఆమెకు వివరించాలని ప్రయత్నిస్తే నన్ను కూడా శత్రువులా భావిస్తోంది. పుట్టింటి వారి మాట వినే పరిస్థితిలోనూ లేదు. ఆమె నమ్మినదే నిజం అనుకుంటోంది. ఎవరైనా ఏదైనా అంటే అదే మాటను చాలా రోజుల పాటు గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపండి.

- గోపి ఎం. (ఈమెయిల్‌)

సలహా: మీరు తెలిపిన వివరాలు మానసిక జబ్బుకు సంకేతంలా కనిపిస్తున్నాయి. కలలకు అర్థాలు చెప్పటం, ఎవరో వెంబడిస్తున్నారని, ఏదో హాని తలపెడుతున్నారని అనుకోవటం వంటివన్నీ భ్రమలకు లోనవుతుండటానికి సూచికలే. భ్రమలకు లోనయ్యేవారికి ఆయా నమ్మకాలకు రుజువు లేదని కారణాలతో వివరించి చెప్పినా అంగీకరించరు. తాము అనుకున్నదే సరైనదని భావిస్తుంటారు. మీరు, పుట్టింటివారు చెప్పినా ఇప్పుడు మీ భార్య వినే పరిస్థితిలో లేదంటున్నారు. నిజానికిది మాటలతో, నచ్చజెప్పే ప్రయత్నంతో తగ్గేది కాదు. కాబట్టి మీరు మానసిక వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఆయా లక్షణాలు, ఆలోచనలు, ప్రవర్తన, స్వభావాలను బట్టి సమస్యను గుర్తిస్తారు. అవసరమైన చికిత్స సూచిస్తారు. మెదడులోని రసాయనాలను అడ్డుకునే మందులతో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఆలోచన ధోరణిని మార్చే కౌన్సెలింగ్‌ కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు పిల్లలు కలగటానికి చికిత్స తీసుకుంటున్నామనీ అంటున్నారు. కొన్నిసార్లు సంతానలేమి చికిత్సలో భాగంగా ఇచ్చే హార్మోన్లతోనూ ఇలాంటి మానసిక లక్షణాలు తలెత్తొచ్చు. ఈ మందులు ఆరంభించిన తర్వాత మానసిక లక్షణాలు మొదలయ్యాయా? అంతకు ముందు నుంచే ఉన్నాయా? అనేది మీరు తెలపలేదు. ఒకవేళ హార్మోన్లు సమస్యకు కారణమవుతున్నట్టు భావిస్తే గైనకాలజిస్టును సంప్రదించి, మందులు మార్చుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా నిర్లక్ష్యం చేయటం తగదు. మానసిక వైద్యులను సంప్రదించటానికి వెనకాడొద్ధు ఆలస్యమైతే పరిస్థితి విషమిస్తుందని తెలుసుకోవాలి.

మీ ఆరోగ్య సమస్యలు, సందేహాలను పంపాల్సిన

ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని