Updated : 05 Jul 2022 05:52 IST

పార్కిన్సన్స్‌ గుట్టు!

చేతులు, తల వంటివి అదేపనిగా వణకటం. ఉన్నట్టుండి అదిరినట్టు కదలటం. ఇలాంటి ఇబ్బందులతో వేధించే పార్కిన్సన్స్‌ డిసీజ్‌ మొదలైందంటే జీవితమే మారిపోతుంది. కదలికలు నెమ్మదిస్తాయి. చివరికి నడవటం, మాట్లాడటమూ కష్టమైపోతుంది. ఇది ఎందుకు వస్తుందో కచ్చితంగా తెలియదు. నిర్ధరించే పరీక్షలు గానీ నయం చేసే మందులు గానీ లేవు. అందుకే దీని గుట్టుమట్లను ఛేదించటం మీద పరిశోధకులు నిశితంగా దృష్టి సారించారు.

పార్కిన్సన్స్‌ డిసీజ్‌ క్రమంగా తీవ్రమవుతూ వచ్చే సమస్య. దీనికి మూలం మెదడులో డోపమైన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు సక్రమంగా పనిచేయకపోవటం, చనిపోవటం. సున్నితమైన, ఉద్దేశపూర్వకంగా చేసే కదలికలకు డోపమైన్‌ అత్యవసరం. ఇది లోపిస్తే కదలికలు అస్తవ్యవస్తమవుతాయి. మెదడులో డోపమైన్‌ ఉత్పత్తి తగ్గటానికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. జన్యువులు, ఇతర అంశాలు ఇందులో పాలు పంచుకుంటుండొచ్చని భావిస్తున్నారు. పురుగుమందులు, భార లోహాలు, గాలి కాలుష్యం వంటి వాటి ప్రభావాలు పార్కిన్సన్స్‌ ముప్పు పెరిగేలా చేస్తాయి. ఇది కొందరిలో వంశ పారంపర్యంగానూ కనిపిస్తుంటుంది. అయితే దీని బారినపడుతున్న చాలామందిలో కుటుంబంలో ఎవరికీ ఈ జబ్బు లేకపోవటం గమనార్హం. పార్కిన్సన్స్‌ ప్రధాన ముప్పు కారకాల్లో వృద్ధాప్యం ఒకటి. అరవై ఏళ్లు పైబడినవారిలో సుమారు ఒక శాతం మందికి ఇది వచ్చే అవకాశముంది.

పరీక్షల మీద కన్ను

ప్రస్తుతం పార్కిన్సన్స్‌ జబ్బుకు ఎలాంటి పరీక్ష లేదు. దీన్ని చాలావరకు కదలికల అస్తవ్యస్తతతోనే నిర్ధరిస్తుంటారు. అయితే కదలికలు దెబ్బతినటానికి చాలా ఏళ్ల ముందుగానే మలబద్ధకం, వాసన పోవటం, మూడ్‌లో మార్పులు, ఆందోళన పెరగటం, నిద్ర దెబ్బతినటం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే కదలికలకు సంబంధించిన లక్షణాలు కనిపించటానికి ముందే పార్కిన్సన్స్‌ను నిర్ధరించటానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మనం నిద్రిస్తున్నప్పుడు కనుగుడ్డు వేగంగా కదిలే (రెమ్‌ స్లీప్‌) దశలో మెదడు చురుకుదనం మళ్లీ పుంజుకుంటుంది. అంటే నిద్ర అంత గాఢంగా ఉండదన్నమాట. మనకు కలలు వచ్చేదీ ఈ దశలోనే. ఇలాంటి రకం నిద్ర అస్తవ్యస్తమయ్యేవారిలో కొందరికి పార్కిన్సన్స్‌ రావొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గుట్టును ఛేదించటం మీద పరిశోధకులు దృష్టి సారించారు. రక్తంలో, ఇతర ద్రవాల్లో కనిపించే జీవ సూచికలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ జీవసూచికల్లో ఒకటి ఆల్ఫా-సైన్యూక్లీన్‌ అనే ప్రొటీన్‌. పార్కిన్సన్స్‌ బారినపడ్డవారి మెదడులో ఏర్పడే విషతుల్య ముద్దల్లో ఇది పోగుపడుతుంటుంది. ప్రస్తుతానికి దీన్ని మరణించిన తర్వాతే కొలవగలుగుతున్నాం. రక్తంలో, వెన్ను ద్రవంలో.. అలాగే మెదడు స్కాన్‌లతో ఆల్ఫా-సైన్యూక్లీన్‌ను కొలిచే మార్గాలను గుర్తించటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. పార్కిన్సన్స్‌ జబ్బు ముదురుతున్న క్రమాన్ని, దీనికి తీసుకునే చికిత్సల ప్రభావాన్ని గుర్తించటానికీ ఇది ఉపయోగపడగలదు.


వ్యాయామాల మేలు

ఇప్పటివరకైతే పార్కిన్సన్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు. లక్షణాలను తగ్గించటానికి, రోజువారీ పనులు సాఫీగా చేసుకునేలా చూడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. డోపమైన్‌ లోపాన్ని భర్తీ చేయటానికి ఎల్‌-డోపా మందు తోడ్పడుతుంది గానీ ఇది అందరికీ పనికిరాదు. మెదడులో ఇతర రసాయనాల మీద పనిచేసే కొన్ని మందులు కదలికలు మెరుగు పడేలా చేస్తాయి. కొందరికి శస్త్రచికిత్సతో మెదడు లోపల స్టిమ్యులేషన్‌ పరికరాన్ని అమర్చటమూ ఉపయోగపడుతుంది. పార్కిన్సన్స్‌ లక్షణాలు తగ్గటానికి అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు ఉపయోగపడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఎంత వ్యాయామం అవసరం? ఎలాంటి వ్యాయామాలు మేలు చేస్తాయి? అనేవి గుర్తించటానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ట్రెడ్‌మిల్‌ మీద పరుగెత్తటం, సైకిల్‌ తొక్కటం వంటి వాటితో పరీక్షిస్తున్నారు. పార్కిన్సన్స్‌ తొలిదశలో వ్యాయామాలు మొదలెడితే జబ్బు త్వరగా ముదరకుండా చూసుకోవచ్ఛు కాబట్టి పార్కిన్సన్స్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం ఎంతైనా మంచిది.


సంగీతం సాయం

కొందరికి పాటలు పాడటమూ మేలు చేస్తుంది. ఇది గొంతును బలోపేతం చేస్తుంది. మింగటం వంటి పనులూ మెరుగవుతాయి. లయ బద్ధమైన సంగీతం నడవటానికి, స్థిరంగా ఉండటానికి తోడ్పడుతుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని