ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో ఆలస్యమే విషమం!

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు అనగానే మూత్రం ఎక్కువగా రావటం వంటివే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం వస్తుందని చాలామంది అనుకుంటుంటారు.

Updated : 09 Aug 2022 01:03 IST

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లక్షణాలు అనగానే మూత్రం ఎక్కువగా రావటం వంటివే గుర్తుకొస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం వస్తుందని చాలామంది అనుకుంటుంటారు. శాస్త్రీయంగా పెద్దగా రుజువులు లేకపోయినా దశాబ్దాలుగా ఇలాంటి మూత్ర లక్షణాలను విశ్వసిస్తూనే వస్తున్నారు. ఫలితంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను గుర్తించటం ఆలస్యమవుతోందని, దీన్ని నయం చేసే స్థితి దాటిపోతోందని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జి అధ్యయనం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ రెండోది. పురుషుల్లో క్యాన్సర్‌ మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది ఆరోది. దీన్ని తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. చాలావరకు నయం చేయొచ్చు కూడా. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ బాధితుల్లో మూడొంతుల కన్నా ఎక్కువ మంది పదేళ్లకు పైగా జీవిస్తున్నారు కూడా. అయితే దశాబ్దకాలంలో వీరి సంఖ్యలో పెద్దగా పురోగతి కనిపించటం లేదు. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించటమే దీనికి ప్రధాన కారణం. సుమారు 50% మందిలో మూడు, నాలుగో దశల్లోనే బయటపడుతోంది. ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ సంకేతాలను మూత్ర సంబంధ లక్షణాలతో ముడి పెడుతుండటం మూలంగానే దీన్ని గుర్తించటం ఆలస్యమవుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బినప్పుడు మూత్రం తరచూ రావటం నిజమే. కానీ క్యాన్సర్‌ కణితుల్లో ఇది అరుదేనని, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో ప్రోస్టేట్‌ గ్రంథి చిన్నగానే ఉంటోందని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. నిజానికి మూత్ర సంబంధ లక్షణాలు లేకపోవటమే క్యాన్సర్‌ ఉందనటానికి పెద్ద సంకేతమనీ ఒక అధ్యయనం చెబుతోంది. అందువల్ల తరచూ మూత్రం రావటం వంటి లక్షణాలు లేనంత మాత్రాన ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ లేదనే భరోసా తగదని పరిశోధకులు సూచిస్తున్నారు. రక్తంలో ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంటీజెన్‌ (పీఎస్‌ఏ) మోతాదుల ద్వారా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ను అనుమానిస్తారు. అయితే ఇది అన్నిసార్లూ కచ్చితంగా జబ్బును తెలియజేయలేదు. పీఎస్‌ఏ మోతాదుల కన్నా దీని సాంద్రతే మరింత కచ్చితంగా క్యాన్సర్‌ను పట్టిస్తుంది. ఇలాంటివారికి ప్రోస్టేట్‌ గ్రంథి నుంచి చిన్న ముక్క తీసి పరీక్షిస్తే సమస్య ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని