అన్నవాహిక చుట్టూ రక్తనాళం ముడి?

మా పాప వయసు 11 నెలలు. పుట్టుకతోనే గుండెజబ్బు ఉంది. బరువు అంతగా పెరగటం లేదు. సరిగా తినదు. కొన్నిసార్లు తిన్నది బయటకు వస్తుంది. అప్పుడప్పుడు పడుకున్న సమయంలో గురకలా వస్తుంది. ఇటీవల స్కాన్‌ చేస్తే అన్నవాహికకు గుండె రక్తనాళం చుట్టుకొని ఉన్నట్టు తేలింది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

Published : 16 Jul 2019 00:29 IST

సమస్య - సలహా

సమస్య: మా పాప వయసు 11 నెలలు. పుట్టుకతోనే గుండెజబ్బు ఉంది. బరువు అంతగా పెరగటం లేదు. సరిగా తినదు. కొన్నిసార్లు తిన్నది బయటకు వస్తుంది. అప్పుడప్పుడు పడుకున్న సమయంలో గురకలా వస్తుంది. ఇటీవల స్కాన్‌ చేస్తే అన్నవాహికకు గుండె రక్తనాళం చుట్టుకొని ఉన్నట్టు తేలింది. ఇదేం సమస్య? దీనికి పరిష్కారమేంటి?

- శ్రావ్య, హైదరాబాద్‌

 

సలహా: దీన్ని వ్యాస్కులార్‌ రింగ్‌ అంటారు. అంటే అన్నవాహిక, శ్వాసనాళానికి బృహద్ధమని (అయోర్టా) ముడిలాగా చుట్టుకోవటం. సాధారణంగా గుండె నుంచి రక్తాన్ని బయటకు తీసుకొచ్చే బృహద్ధమని ఎడమ వైపునకు వెళ్తుంది. కొందరికి పుట్టుకతో లోపం మూలంగా ఇది కుడివైపునకు వెళ్తుంటుంది (రైట్‌ అయోర్టిక్‌ ఆర్చ్‌). దీని వంపు (ఆర్చ్‌) రెండుగానూ చీలిపోయి ఉండొచ్చు (డబుల్‌ అయోర్టిక్‌ ఆర్చ్‌). ఇది అన్నవాహికకు, శ్వాసనాళానికి చుట్టూ చుట్టుకొని ముడిలాగా పడిపోతుంటుంది. మీ అమ్మాయికి ఉన్న సమస్య ఇదే. కొందరిలో ఈ ముడి తీవ్రంగానూ ఉండొచ్చు. అంటే రెండు చెట్ల కొమ్మలు బాగా పెనవేసుకుపోయినట్టుగా అవ్వచ్చు. దీంతో శ్వాసనాళం నుంచి ఊపిరితిత్తుల్లోకి గాలి సరిగా వెళ్లదు. ఫలితంగా శ్వాస తీసుకునే సమయంలో పిల్లికూత, గురక లాంటిది (స్ట్రైడర్‌) వస్తుంది. బృహద్ధమని కుడివైపునకు తిరిగి ఉన్నవారిలో లక్షణాలు పుట్టిన వెంటనే కనబడవు. కొన్నిరోజుల తర్వాత బయటపడతాయి. ముఖ్యంగా అన్నం, ఇడ్లీ వంటి ఘన పదార్థాలు ఆరంభించినప్పుడు మొదలవుతుంటాయి. అన్నవాహికకు బృహద్ధమని చుట్టుకుపోవటం వల్ల తిన్నది సరిగా  మింగుడు పడదు. మధ్యలో ఇరుక్కుపోతుంది. అందువల్ల పిల్లలు ఘన పదార్థాల కన్నా పాల వంటి ద్రవాలు తీసుకోవటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సరిగా తినకపోవటం వల్ల బరువు తగ్గుతూ వస్తుంటారు. తిన్న పదార్థాలు అన్నవాహికలో ఇరుక్కుపోవటంతో మరో సమస్య ఏంటంటే- పడుకున్నప్పుడు లేదా మళ్లీ ఆహారం తింటున్నప్పుడు అవి శ్వాసనాళంలోకి వెళ్లిపోవటం (ఆస్పిరేషన్‌). దీంతో తరచుగా ఊపిరితిత్తుల్లో న్యుమోనియా తలెత్తుతుంది. బరువు పెరగకపోవటం, ఘన పదార్థాలు తినలేకపోవటం, తరచుగా న్యుమోనియా రావటం, శ్వాస తీసుకునేటప్పుడు గురక రావటం వంటి లక్షణాల ఆధారంగానే సమస్యను గుర్తిస్తారు. స్కాన్‌ చేస్తే బృహద్ధమని తీరుతెన్నులు తెలుస్తాయి. వ్యాస్కులార్‌ రింగ్‌ ఉన్నట్టు అనుమానం వస్తే ఎకో స్కాన్‌ లేదా సీటీ స్కాన్‌ చేసి సమస్యను నిర్ధారిస్తారు. బేరియం ద్రవాన్ని తాగించి ఎక్స్‌రే కూడా తీస్తారు. అన్నవాహికలోంచి ముద్ద దిగుతుందా లేదా అనేది ఇందులో బయటపడుతుంది. దీనికి శస్త్రచికిత్స తప్ప మరో మార్గం లేదు. ఇది గుండె లోపలి సమస్య కాదు. బయటి సమస్య. అందువల్ల ఛాతీని పూర్తిగా తెరచి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేదు. పక్కటెముకల వద్ద చిన్న రంధ్రం చేసి సరిచేయొచ్చు. ఇందులో ముడిపడిన రక్తనాళాన్ని కత్తిరించి, కుట్లు వేసి మూసేస్తారు. దీన్నుంచి శరీర భాగాలకు రక్తమేమీ సరఫరా కాదు కాబట్టి కత్తిరించినా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అవతలి వైపు రక్తనాళం నుంచి రక్తం సరఫరా అవుతుంది. ఒకోసారి రక్తనాళానికి బదులు కండర బంధనం ముడి పడిపోయి ఉండొచ్చు. దీన్ని కత్తిరిస్తే సరిపోతుంది. మీరు నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన పిల్లల గుండె వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. అవసరమైన పరీక్షలు చేసి సమస్యను నిర్ధారించి, చికిత్స చేస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం,  రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని